నిలువ నీడేదీ! | - | Sakshi
Sakshi News home page

నిలువ నీడేదీ!

Jul 4 2025 4:00 AM | Updated on Jul 4 2025 4:00 AM

నిలువ నీడేదీ!

నిలువ నీడేదీ!

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి 2023లో విశాఖపట్నానికి చెందిన లారెస్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ముందుకు వచ్చింది. రత్నగిరి రామాలయం పక్కన రేకులతో వేసిన విశ్రాంతి షెడ్డు లాగే ఇక్కడ కూడా నిర్మించాలని నిర్ణయించారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. ఆ తర్వాత కొత్త ఈఓ రావడంతో ఆ ప్రతిపాదన కాస్తా అటకెక్కింది. దీంతో ఆ నిధులను సంస్థ మరో కార్యక్రమానికి వినియోగించింది. అనంతరం ఇక్కడ రేకుల షెడ్డు కాకుండా, ప్లాస్టిక్‌ క్లాత్‌లా టెన్‌సిల్‌ రూఫ్‌ షెడ్డు వేయాలని దేవస్థానం ప్రతిపాదించింది. దీనిపై ఆలోచన చేస్తామని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో నీడ లేక, చలువ పందిరిలో వర్షానికి తడిసి భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

నీడ లేక అవస్థలు

పశ్చిమ రాజగోపురం వద్ద భక్తులకు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గతంలో 60 గదులతో సత్యదేవ అతిథి గృహం (సత్రం) ఉండేది. భక్తుల కోసం (గ్యాలోరిమ్‌ టైల్స్‌ రూఫ్‌ షెడ్‌) విశ్రాంతి షెడ్డు నిర్మించాలనే ఆలోచనతో ఆ సత్రాన్ని 2023 అక్టోబర్‌లో తొలగించారు. అక్కడ విశాల షెడ్డు నిర్మించాలని అప్పటి ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ ప్రణాళిక రూపొందించారు. విశాఖపట్నానికి చెందిన లారెస్‌ సంస్థ రూ.1.99 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఆ ఏడాది కార్తిక మాసం ప్రారంభం కావడంతో తాత్కాలిక షెడ్డు నిర్మించారు. కార్తిక మాసం అనంతరం షెడ్డు నిర్మించడానికి ఆ సంస్థ మెటీరియల్‌ కూడా సిద్ధం చేసింది.

ఈఓ బదిలీతో..

కాగా, ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఆయన స్థానంలో ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ బాధ్యతలు చేపట్టారు. రేకుల షెడ్డు నిర్మిస్తే రాజగోపురం కనిపించదని ఆయన ఆ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలోనే లారెస్‌ సంస్థ ఆ నిధులను వేరే పనులకు వినియోగించింది.

పార్కింగ్‌గా షెడ్డు స్థలం

పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్రం కూల్చివేయడంతో, ఆ ప్రదేశం పార్కింగ్‌ స్థలంగా మారింది. దేవస్థానం బస్సులు కూడా ఇక్కడే పార్కింగ్‌ చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ నుంచి సత్యదేవుని ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. వేసవిలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేస్తున్నారు. ఈ ఏడాదీ అలాగే చేశారు. వర్షం పడితే చలువ పందిళ్ల నుంచి నీరు కారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానం వారు కనీసం షెడ్డు వేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.సుబ్బారావు గత ఫిబ్రవరిలో లారెస్‌ సంస్థ ప్రతినిధులను షెడ్డు నిర్మించాలని కోరారు. నాలుగు నెలలైనా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆ సంస్థ ముందుకు రాకపోతే దేవస్థానం నిధులైనా వెచ్చించి, షెడ్డు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

శ్రావణ మాసంలో రద్దీ

ప్రస్తుతం ఆషాఢ మాసంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా.. జూలై 25 నుంచి శ్రావణ మాసంలో సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. వివాహాల సీజన్‌ కావడంతో రాత్రి వేళల్లో కూడా పెద్ద సంఖ్యలో పెళ్లి బృందాలు వస్తాయి. అదే సమయంలో వర్షాలు కూడా అధికమవుతాయి. దీంతో భక్తుల అవస్థలు చెప్పనలవి కాదు.

అధికారులు ఏమన్నారంటే..

పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో నిధులు లేవని తెలిపింది. చిన్న షెడ్డు నిర్మిస్తామని చెప్పింది. పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు. వారు అంగీకారం తెలిపిన వెంటనే దేవస్థానం చైర్మన్‌, ఈఓల అనుమతి తీసుకుని షెడ్డు నిర్మిస్తామన్నారు.

ఫ పశ్చిమ రాజగోపురం వద్ద

విశ్రాంతి షెడ్డు నిర్మాణమెప్పుడో?

ఫ 2023లో 60 గదుల

సత్యదేవ సత్రం కూల్చివేత

ఫ రూ.1.99 కోట్లతో షెడ్డు నిర్మాణానికి లారెస్‌ ఫార్మా సంసిద్ధత

ఫ ఆ నిధులను మరో కార్యక్రమానికి

వెచ్చించిన సంస్థ

ఫ నీడ లేక సత్యదేవుని భక్తులకు ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement