
ఎయిర్ వాల్వ్‌లో పడిన కారు
తప్పిన ప్రమాదం
పి.గన్నవరం: స్థానిక ఏజీ రోడ్డులో వెళ్తున్న ఒక కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న మంచినీటి పైపులైన్ ఎయిర్ వాల్వ్ గోతిలో పడటంతో ముందు చక్రం విరిగిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పి.గన్నవరం ప్రధాన పంట కాలువ నుంచి ముంగండ మంచినీటి ప్రాజక్టుకు వెళ్లే పైపులైన్లు గతంలో రోడ్డు మార్జిన్లో ఉండేవి. అయితే ఇటీవల రోడ్డును వెడల్పు చేశారు. దీంతో మూడుచోట్ల పైపు లైన్ల ఎయిర్ వాల్వ్‌లు సీసీ రోడ్డులోకి వచ్చాయి. దీంతో అక్కడ రంధ్రాలు ఏర్పడటంతో సిమెంట్ వరలు ఏర్పాటు చేశారు. ఆ వరలు విరిగిపోవడంతో గోతులు ఏర్పడ్డాయి. వీటిని గమనించని వాహన చోదకులు వాటిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల పలువురు ద్విచక్ర వాహన చోదకులు ఆ గోతుల్లో పడి గాయాల పాలయ్యారు. తక్షణమే ఎయిర్ వాల్వ్‌లు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.