
టెండర్ ఖరారు రేపే..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్, క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్‌డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ గురువారం ఖరారు కానుంది. దీని ప్రైస్ బిడ్‌ను విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం తెరవనున్నారు. సోమవారం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ గురువారం ఓపెన్ చేసి, లోయెస్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు.
గత టీడీపీ ప్రభుత్వంలో ‘పద్మావతి’కి టెండర్
కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య రాష్ట్రంలో అన్నవరం దేవస్థానం సహా, పలు దేవస్థానాల్లో శానిటరీ టెండర్‌ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్ల కాల పరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు, తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించింది. ఇప్పుడు మరలా అదే సంస్థ టెక్నికల్ బిడ్‌లో క్వాలిఫై కావడంతో, మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పద్మావతి సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే కారణంగా చెబుతున్నారు.
ప్రముఖ దేవస్థానాల్లో రీ టెండర్
గత ఏప్రిల్ నెలలో పిలిచిన టెండర్ నోటిఫికేషన్‌పై టెండర్‌దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్‌ను జూన్ 12న విడుదల చేసింది. టెండర్‌దారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జూన్ 26గా నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది తప్పుకొన్నారు. చివరకు చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్ బిడ్‌కు ఎంపికయ్యాయి.
ఏడు దేవస్థానాల్లో శానిటరీ నిర్వహణ
టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదార్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది.
గత ప్రభుత్వ హయాంలో విడివిడిగా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని పది నెలలు జాప్యం చేసింది. ఒకే యూనిట్‌గా టెండర్లు నిర్వహించాలని గతేడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా..
అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గతేడాది నవంబర్‌తో ముగిసింది. ఆ కాంట్రాక్ట్ ముగియడానికి ఒక నెల ముందుగానే గత అక్టోబర్‌లో టెండర్ విడుదల కావాల్సి ఉంది. టెండర్లు ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి ఒకటి నుంచి తాము విధులు నిర్వహించలేమని దేవస్థానానికి లేఖ సమర్పించారు. దీంతో టెండర్ పిలవకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థకు తాత్కాలికంగా పనులు అప్పగించారు.
పెరగనున్న కాంట్రాక్ట్..?
గత నవంబర్‌తో ముగిసిన కేఎల్‌టీసీ సంస్థ శానిటరీ టెండర్ నెలకు రూ.49 లక్షలు. దేవస్థానం కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలుగా చెల్లిస్తున్నారు. రూ.12 లక్షలు మెటీరియల్‌కు ఖర్చు చేస్తున్నారు. మొత్తం నెలకు రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి సెంట్రలైజ్డ్ టెండర్‌లో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతు విధించారు. శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాల చెల్లింపుతో పాటు, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్స్‌గా కొంతమందిని నియమించనున్నారు. ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు పైమాటే అంటున్నారు.
ప్రముఖ దేవాలయాలకు
గత ఏప్రిల్‌లో నోటిఫికేషన్
దానిని రద్దు చేసి మళ్లీ
జూన్ 12న రీటెండర్
కొత్త షరతుల ప్రకారం
రూ.80 లక్షలకు పెరిగే అవకాశం

టెండర్ ఖరారు రేపే..