
కనకాయలంక కాజ్ వే వద్ద వంతెన నిర్మాణం
రూ.22.83 కోట్లకు పరిపాలనా ఆమోదం
పి.గన్నవరం: కొద్దిపాటి వరదకే కాజ్ వే నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయి. మండలంలోని చాకలిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న కనకాయలంక కాజ్ వే వద్ద హై లెవెల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.83 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం ఇచ్చినట్టు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. కనకాయలంక, చాకలిపాలెం (వశిష్ట ఎడమ ఏటిగట్టు) గ్రామాలను కలుపుతూ వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. రూ.24 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, రూ.22.83 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కనకాయలంక గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వారి జీవన విధానం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంతో ముడిపడి ఉంది. నిత్యం కాజ్ వే దాటి పి.గన్నవరం మండలానికి వస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తే కనకాయలంక కాజ్ వే మునిగిపోతోంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో కాజ్ వే దాటి వస్తుంటారు. వరద నీరు మరీ ఎక్కువైతే పడవలపై ప్రయాణిస్తారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తయితే కనకాయలంక గ్రామాల ప్రజల వరద కష్టాలు తీరతాయి.
పెదలంక వద్ద వంతెన
అలాగే వరద సమయాల్లో ప్రజల రాకపోకల కోసం వశిష్ట ఎడమ ఏటిగట్టు నుంచి యలమంచిలి మండలం పెదలంకకు రూ.80.8 లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు వంతెనకు కూడా పరిపాలనా ఆమోదం లభించినట్టు ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. టెండర్లు పూర్తయిన తర్వాత ఈ వంతెన పనులు ప్రారంభమవుతాయని ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ వివరించారు.