ప్రాణం లేదని.. కాటికి తీసుకెళ్తే.. 

Tv Mechanic Deceased In Prakasam District - Sakshi

సాక్షి, కందుకూరు‌: జీవం లేదు.. వెంటిలేటర్‌ తీసివేస్తే మహా అయితే రెండు గంటలు ప్రాణం ఉంటుంది.. అని ఒంగోలులోని ఓ కార్పొరేటు వైద్యశాల వైద్యులు చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటికి ఎందుకు తీసుకెళ్లడం.. అని కందుకూరులోని శ్మశానానికి తీసుకెళ్లారు. పూడ్చి పెట్టేందుకు గుంత కూడా తీసిపెట్టారు... కానీ అక్కడకు తీసుకువెళ్లిన తరువాత అందరినీ ఆశ్చర్యపరిచేలా కాళ్లు, చేతులు కదిలించాడు. కళ్లు తెరిచి చూశాడు. ఈ సంఘటన చూసి అక్కడి వారందరూ అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులోని వైద్యులతో మాట్లాడి వైద్యశాలలో చేర్పించారు. తరువాత కాస్త కుదుటపడ్డాడు. మజ్జిగ తాగాడు. మరలా 7 గంటలసేపు మృత్యువుతో పోరాడి మరణించాడు.

కందుకూరు పట్టణంలో ఆదివారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్‌లోని పి.వెంకటేశ్వర్లు (56) టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాళిదాసువారి వీధిలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటాడు. భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఉదయం బాత్‌రూంకు వెళ్లి జారిపడి అపస్మారక స్థితిలోనికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి ఫర్వాలేదనడంతో ఇంటికి తీసుకువెళ్లారు. మరలా శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తరువాత కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అత్యవసర చికిత్స అవసరం అని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌ వైద్యులు ఇక్కడ తలకు సంబంధించిన ఆధునిక పరికరాలు లేవు అని చెప్పడంతో ఒంగోలులోని పలు వైద్యశాలకు తీసుకుని వెళ్లినా ఖాళీలు లేక చేర్చుకోలేదు. దీంతో తన కుమారుడు మా నాన్న కు న్యాయం చేయండి.. అని కందుకూరు సామాజిక మాధ్యమాల  గ్రూపుల్లో తెలియచేశాడు. దీంతో పాత్రికేయులు, స్థానికులు స్పందించారు. తోచిన విధంగా తెలిసిన వైద్యులతో మాట్లాడారు.

శ్మశానంలో గుంత తీస్తున్న బంధువులు 

చివరగా  ఓ కార్పొరేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. కరోనా పరీక్షలు చేసి నెగిటివ్‌ రావడంతో అక్కడ వైద్యం చేయించారు. వైద్యులు వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స అందించారు. ఆదివారం ఉదయం అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ ఉంచి డబ్బులు వృథా చేసుకోవడం ఎందుకు అని సలహాలు ఇచ్చారు. వెంటిలేటర్‌ తీసి వేస్తే మరో రెండు గంటలు ప్రాణం ఉంటుందని తరువాత ఉండదు అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్లమని చెప్పారు. కుటుంబ సభ్యులు ఎలాగా జీవం లేదన్నారు. ఇంటికి వెళ్లడానికి సొంత ఇల్లు లేదు. అద్దె ఇంటికి ఎందుకు తీసుకువెళ్లడం అని నేరుగా శ్మశానానికి తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి ఆరామ క్షేత్రంలో ఉంచి.. పూడ్చిపెట్టడానికి గుంట కూడా తీసి పెట్టారు.

ఈ తంతు అంతా జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలో మార్పులు వచ్చాయి. కాళ్లు చేతులు కదలడం ఆరంభించాయి. కళ్లు తెరిచి చూశాడు. దీంతో అక్కడివారు అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులో ఉన్న వైద్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వైద్యశాలకు తీసుకుని వస్తే వైద్యం చేస్తామని వారు తెలియచేయడంతో నేరుగా శ్మశానం నుంచి కందుకూరు లోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మజ్జిగ కూడా తాగినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న సమయంలో ఏడుగంటల సేపు మృత్యువుతో పోరాడాడు. రాత్రి 8 గంటల సమయంలో మరణించాడు. ఇందులో నిర్లక్ష్యం ఎవరిది అనేది పక్కనపెడితే  కరోనా నేపథ్యంలో వైద్యశాలలు, కుటుంబ సభ్యులు, గ్రామంలోని పరిస్థితుల ఒత్తిడులు ఇలాంటి ఘటనలు జరిగేలా చేస్తున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top