మోసాల్లో బ్యాం‘కింగ్స్‌’! 

Telangana: Bank Managers Robbing Money Form Of Loans - Sakshi

నిందితులతో కలిసి రూ. కోట్లు కొట్టేస్తున్న కొందరు బ్యాంకు మేనేజర్లు

రాష్ట్రంలోని బ్యాంకు నేరాల్లో మెజారిటీ పాత్రధారులు వారే!

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును రుణాల రూపంలో ఆర్థిక నేరగాళ్లకు దోచిపెట్టడంలో కొందరు బ్యాంకు అధికారుల వ్యవహారం సంచలనం రేపుతోంది. బ్యాంకుల్లో మేనేజర్లుగా, ఆపై స్థాయిలో పనిచేసే కొందరు అధికారుల అవినీతి ఎంతటి స్థాయిలో ఉందంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) నమోదు చేసిన బ్యాంకు మోసాల కేసుల్లో 75 శాతం వారి ప్రమేయం ఉన్నవే ఉండటం గమనార్హం. 

లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు.. 
చేప పిల్లల పెంపకం, అమ్మకాల వ్యాపారం పేరుతో ఓ సంస్థ రూ. 6 కోట్లకుపైగా కొల్లగొట్టిన అభియోగాలపై కంపెనీ యజమాని, డైరెక్టర్లు సహా యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌పై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. కంపెనీ సమర్పించిన నకిలీ పత్రాలపై రూ. 6 కోట్లు లోన్‌ మంజూరు చేసి కమిషన్‌ తీసుకున్నట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. చేప పిల్లలు కాదు కదా.. కనీసం అక్కడ చేపల పెంపకానికి సంబంధించి చెరువు కూడా లేకపోవడం సంచలనం రేపింది. 

ఏకంగా రూ. 200 కోట్లు... 
హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ ఫైనాన్స్‌ లిమిటెడ్, వరుణ్‌ ఫైనాన్స్‌ బాధ్యులు ఫోర్జరీ పత్రాలతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ. 200 కోట్ల రుణం పొందారు. ఈ వ్యవహారంలోనూ బ్యాంక్‌ అధికారుల పాత్రపై సీఐడీ విచారణ సాగిస్తోంది. కంపెనీ సమర్పించిన పత్రాలు అసలైనవా కాదా అని ధ్రువీకరించుకోకుండా లోన్లు జారీ చేసిన బ్యాంకు అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

ఎస్‌బీఐ పరిశ్రమ భవన్‌లోనూ.. 
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎస్‌బీఐ పరిశ్రమ భవన్‌ బ్రాంచీ మేనేజర్‌ నవీన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థకు రూ. 4 కోట్ల మేర రుణం మంజూరు చేశారు. సంస్థ సమర్పించిన బ్యాలెన్స్‌షీట్, కోలాటరల్‌ ఆస్తుల వివరాలను సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లో ధ్రువీకరించుకోకుండానే మేనేజర్‌ ఈ రుణం ఇచ్చారు. ఎస్‌బీఐ అంతర్గత ఆడిటింగ్‌లో కుట్ర బయటపడటంతో బ్యాంకు అధికా రులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కాగా, తాజాగా తెలుగు అకాడమీకి చెందిన రూ. 64 కోట్లకుపైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కొట్టేసిన నిందితులకు పలువురు బ్యాంక్‌ మేనేజర్లే సహకరించినట్లు సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఆ విభాగాల్లో 75 శాతం కేసులు అవే... 
ఇప్పటివరకు సీఐడీ దగ్గర నమోదై దర్యాప్తు దశలో ఉన్న 107 కేసుల్లో 68 కేసులు బ్యాంకు మోసాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సీబీ ఐ నమోదు చేసిన 17 ఎఫ్‌ఐఆర్‌లలో 9 కేసులు బ్యాంక్‌ చీటింగ్‌ కేసులే. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా సీసీఎస్‌ పో లీసులు ఈ తరహా మోసాలపై నమోదు చేసిన కేసులు వందల్లోనే ఉన్నాయి.

ఇలా ఏ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల మేర సొమ్మును బ్యాంక్‌ అధికారుల అవినీతి వల్ల దోచేసినట్టు సీఐడీ అంచనా వ్యక్తం చేసింది. కనిపించని సైబర్‌ నేరాల్లో రూ. కోట్లు పోగొట్టుకోవడం ఒక ఎత్తయితే... కళ్ల ముందు జరుగుతున్న ఆర్థిక నేరాల నియంత్రణలో కొందరు బ్యాంకు అధికారులే సూత్రధారులు కావడం ఆందోళన రేకేత్తిస్తోంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top