కంట్రోల్‌రూమ్‌ ఉన్నా..ప్రచారం సున్నా

Customs Department Fails Prevent Narcotic Drugs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు, ఆబ్కారీశాఖల్లో ఖాకీ డ్రెస్‌ ధరించిన ప్రతి ఉద్యోగి ప్రధాన కర్తవ్యం నేరాల నియంత్రణ.  కానీ  ఎక్సైజ్‌లో  కొంతకాలంగా ఆ విధి నిర్వహణ కొరవడిందని ఆరోపణలు  వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్కోటిక్‌ డ్రగ్స్‌ నేరాల కట్టడిలో ఆబ్కారీ  యంత్రాంగం  విఫలమవుతోంది. కొందరు అధికారులు మాత్రమే  నిజాయితీగా విధులు నిర్వహిస్తుండగా ఎక్కువ  మంది  ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా  ఆదాయంపైనే  ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ  క్రమంలో పోలీసు  కంట్రోల్‌ రూమ్‌  తరహాలో   ఆబ్కారీ శాఖలోనూ  ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ  ఆచరణలో అలంకారప్రాయంగా మారింది.

దీనిపై  సరైన  ప్రచారం లేదు. మరోవైపు   గంజాయి, కోకైక్‌ వంటి మత్తు పదార్థాల  సరఫరాపై  సమాచారాన్ని  రాబట్టుకునేందుకు గతంలో  బలమైన ఇన్‌ఫార్మర్‌  వ్యవస్థ పని చేసేది. ఒకరిద్దరు  అధికారులు  అలాంటి ఇన్‌ఫార్మర్ల నుంచి  వచ్చే సమాచారం ఆధారంగానే  డ్రగ్స్‌ నియంత్రణలో  మంచి ఫలితాలను సాధించారు. కానీ  ఇప్పుడు కంట్రోల్‌  రూమ్, ఇన్‌ఫార్మర్‌  వ్యవస్థ రెండూ  దాదాపుగా నిర్వీర్యమయ్యాయనే  ఆరోపణలు  ఉన్నాయి. దీంతో  డ్రగ్స్‌ సరఫరా, విక్రేతలను, బాధితులను గుర్తించి  చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్‌శాఖ పనితీరు పరిమితంగా మారింది. పోలీసులకు  ధీటైన యంత్రాంగం ఉన్నప్పటికీ  ఆ స్థాయిలో  పనిచేయడం లేదనే  విమర్శలు  ఉన్నాయి.  

వంద తరహాలో 24733056 నంబర్‌ .... 

  • ఒకవైపు  రాడిస్‌బ్లూ హోటల్‌ వంటి ఉదంతాలు  వెలుగు చూస్తున్నప్పటికీ  మరోవైపు  గంజాయి, ఇతర  మత్తుపదార్థాల  వెల్లువ  కొనసాగుతూనే ఉంది. వివిధ  ప్రాంతాల నుంచి   హైదరాబాద్‌ మీదుగా మత్తుపదార్థాలు సరఫరా  అవుతున్నాయి. అంతేకాకుండా స్కూళ్లు,  కాలేజీలు, నగర శివార్లే  ప్రధాన అడ్డాలుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. 
  • ఈ నేపథ్యంలో 2016లో  అప్పటి  ఎక్సైజ్‌ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌  కంట్రోల్‌  రూమ్‌  వ్యవస్థను  మరింత బలోపేతం చేశారు. స్కూళ్లు, కాలేజీల నుంచి నేరుగా సమాచారం  అందేలా పటిష్టమైన చర్యలు  తీసుకున్నారు. 2017 వరకు  ఈ వ్యవస్థ  సమర్థవంతంగా పని చేసింది.  
  • 24 గంటల పాటు ఫిర్యాదులను స్వీకరించేందుకు సిబ్బందిని నియమించారు. ఎక్కడి నుంచైనా  టోల్‌ ఫ్రీ నంబర్‌ 24733056కు  సమాచారం అందజేయవచ్చు. ఇప్పటికీ ఈ నంబర్‌  అందుబాటులో ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం  వల్ల  పెద్దగా ఫిర్యాదులు అందడం లేదు. బెల్ట్‌షాపులు, మైనర్‌లకు మద్యం అమ్మకాలు వంటి  వాటిపైనే తరచు ఫిర్యాదులు అందుతున్నాయి.. కానీ నార్కోటిక్‌ నేరాలపైన రావడం లేదని ఓ అధికారి  విస్మయం వ్యక్తం చేశారు. ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ  లేకపోవడం కూడా ఇందుకు కారణమని ఆయన  పేర్కొన్నారు.  

బర్త్‌డే పార్టీలు, వేడుకలే  లక్ష్యం... 

  • బర్త్‌డే పార్టీలు, యువత ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశం ఉన్న వేడుకలను లక్ష్యంగా  చేసుకుని  ఒకరి నుంచి  ఒకరికి  ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయి. 
  • ఒక పార్టీలో నలుగురు కొత్తవాళ్లు గంజాయిని  సేవిస్తే  ఆ  నలుగురు మరో నలుగురికి దాన్ని అలవాటు చేస్తున్నారు. ఇలా  వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తుంది. 
  • నగరంలోని ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, నేరేడ్‌మెట్, శేరిలింగంపల్లి, సూరారం, జీడిమెట్ల, కొంపల్లి, బోయిన్‌పల్లి, నాగోల్, కాప్రా, తదితర ప్రాంతాలు ప్రధాన అడ్డాలుగా మారాయి. 

(చదవండి: లగేజ్‌ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top