
ఉద్యమంలా తెలుగు భాషా పరిరక్షణ
పలమనేరు: తెలుగుభాష, సంస్కృతి పరిరక్షణకు సాహితీవేత్తలు ఓ ఉద్యమంలా ముందుకెళ్లాలని ప్రముఖ శతావధాన్ని ఆముదాల మురళి సూచించారు. పట్టణ సమీపంలోని కళామందిరం మూడో వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాతృభాషను కాపాడుకోవాల్సిన అవరసం నేటి తరంపై ఉందన్నారు. పిల్లలు సెల్‌ఫోన్లు పక్కనబెట్టి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని సూచించారు. కర్ణాటకకు చెందిన శాస్త్రవేత్త రమేష్, కడప జానమద్ది సాహితీపీఠం నిర్వాహకులు విజయభాస్కర్ ప్రసంగించారు. నిర్వాహకులు తులసీనాథం నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో నీతిని ప్రతిబింబించేందుకు నీతిపద్యాలు ఎంతో తోడ్పడతాయన్నారు. వందకు పైగా నీతి పద్యాలను చెప్పిన 50 మంది చిన్నారులకు వారు బహుమతులను అందజేశారు. సాహితీ రంగంలో ప్రతిభ చూపుతున్న చింతకుంట శివారెడ్డి, ఏనుగు అంకమనాయుడు, మల్లారపు నాగార్జున, టెంకాయల దామోదరం, మాధవి, నడ్డి నారాయణ, ప్రకాష్‌రెడ్డి, సాంభయ్య, విజయలక్ష్మి, రంభ, హేమాద్రి, సుధాకర్, శాంతాభాస్కర్, ఆళ్ళ నాగేశ్వరావుకు వార్షికోత్సవ పురస్కారాలను అందజేశారు. డాక్టర్ మౌని రచించిన భిన్నధ్రువాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన డా.రజని భరత, కూచిపూడి నాట్యాలు అందరినీ అలరించాయి. ఇందులో పుష్ప, ధనుంజయ, డా.మాధవి, రమ్య, భారతి, జమున, పలమనేరు బాలాజీ, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.