
బడిబాట కాగితాల్లోనే..!
● ఆ 15,879 మంది ఎక్కడున్నారో తెలియని వైనం ● డ్రాప్‌బాక్స్ లెక్కలతో సమగ్రశిక్ష శాఖ అధికారుల హడావుడి ● క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం శూన్యం
చిత్తూరు కలెక్టరేట్ : విద్యాహక్కు చట్టం ప్రకారం బడిఈడు ఉన్న పిల్లలంతా పాఠశాలల్లోనే ఉండాలి. అయితే జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు చిన్నతనంలోనే బడికి దూరమై కార్మికులుగా మారుతున్నారు. ఈ విషయం పలు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6–14 ఏళ్ల వయసు ఉండి బడిలో చేరి మధ్యలో చదువు మానేసిన వారి సంఖ్య అధికారికంగా 15,879 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే జిల్లాలో మాత్రం ఆ దిశగా చర్యలు మాత్రం ముందుకు సాగడం లేదు. తమకేమీ ఆ ఉత్తర్వులు పట్టవనే చందంగా సమగ్రశిక్ష శాఖ అధికారులు ఉదాసీన వైఖరి అనుసరిస్తున్నారు. బడి బయట పిల్లల అంశంపై కలెక్టర్ సైతం పలు మార్లు సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ జిల్లాలో బడిబాట కార్యక్రమం ఊసే లేదు.
కలెక్టర్ దృష్టి పెట్టాల్సిందే
జిల్లా వ్యాప్తంగా కొంత మంది విద్యార్థులను బలవంతంగా బడుల్లో చేర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. బడుల్లో చేర్పించినప్పుడు మాత్రం ఫొటోలు తీసి అధికారులకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. బడిబయటి పిల్లల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో సైతం తెలియని దుస్థితి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ప్రభుత్వ బడులకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు.
పాఠశాలల విలీనం.. విద్యకు దూరం
జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసే పనిచేపట్టారు. దీంతో వేలాది మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమవుతున్నారు. సొంత గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల్లోకి విలీనం చేశారు. దీంతో తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలతో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూనే ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం.