
నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి
● బోన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న షాహిద్ ● చిన్న వయసులోనే పెను విపత్తు ● దాతల చేయూత కోసం తల్లిదండ్రుల వేడుకోలు
చౌడేపల్లె: ‘నాకు ఇద్దరు పిల్లలు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కార్పెంటర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇటీవల వెలువడిన పదోతరగతి ఫలితాల్లో నా కుమారుడు షాహిద్(16) 472 మార్కులు సాధించాడు. గత ఏడాది డిసెంబర్‌లో ఇంటి వద్ద పిల్లలతో కలిసి కబడ్డీ ఆడుతూ జారిపడ్డాడు. కుడి చెయ్యికి గాయమైంది. నొప్పి అధికం కావడంతో పుంగనూరు, మదనపల్లె, తిరుపతిలో చూపించాను. అయినా తగ్గలేదు. నొప్పి ఎక్కువ కావడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. బోన్ క్యాన్సర్ ఉందని తేల్చారు. ఇప్పటికే అప్పూసప్పు చేసి రూ.3 లక్షలకు పైగా ఖర్చుచేశాను. ఇంకా రూ.5 లక్షలకు పైగా అవసరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంత స్థోమత లేక.. ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడిపోతున్నాను. బిడ్డను చూస్తే కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. కడుపు తర్కుపోతోంది. గుండె భారంగా మారుతోంది. బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంతో కాళ్లూచేతులూ ఆడడం లేదు. దైవసమానులైన దాతలు ముందుకొచ్చి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాను’ అని చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లె రోడ్డు, జగనన్న కాలనీకి చెందిన షాజహాన్, నౌహీరా కోరుతున్నారు.
చేతులు కలపండి..ప్రాణం పోయండి
షాజహాన్ (కెనరా బ్యాంకు)
31872200068371 సీఎన్‌ఆర్‌బి0013187)కు,
పోన్‌పే 9705508805కు సహాయం చేయాలని కోరారు.