
కూటమి కక్ష..మామిడి రైతుకు శిక్ష!
● గిట్టుబాటుగాని మామిడి చెట్లను తొలగిస్తున్న రైతులు ● చెట్లు తొలగించినందుకు జరిమానా తప్పదంటున్న అటవీశాఖ ● కూటమి నేతల ఒత్తిడితోనే ఇలా చేయిస్తున్నారని అనుమానం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: మామిడి రైతుపై కొందరు కూటమి నేతలు కక్షగట్టారు. మామిడి చెట్ల నరికివేతను సాకుచూపి వేధింపులకు గురిచేస్తున్నారు. అటవీశాఖ అధికారుల ద్వారా రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. వివరాలు.. చిత్తూరు మండలం, తుమ్మింద గ్రామానికి చెందిన మామిడి రైతు కుమార్ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో తన భూమిలో పనస నాటుకోవాలని నిర్ణయించాడు. దీంతో బుధవారం కొన్ని మామిడి చెట్లను తొలగించారు. దీనిని సాకుగా చూపించి కొందరు కూటమి నేతలు అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ రైతుపై కేసు లేదా జరిమానా విధించేలా చర్యలు చేపట్టాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో రంగలోకి దిగిన అటవీశాఖ అధికారులు పంటను పరిశీలించారు. ఆ తర్వాత రైతును కార్యాలయానికి పిలిపించి వాల్టా చట్టం ప్రకారం జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. మళ్లీ శుక్రవారం కార్యాలయానికి రావాలని పంపిం చేశారు. ఇలా రైతును వేధించడంతో పాటు కార్యాలయానికి తిప్పించుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. కూటమి నేతలు కక్ష పూరితంగానే ఇలా చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రైతు సంఘ నేతలు, వివిధ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులపై ఇలా ఆంక్షలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. చట్టంలో కూడా మామిడి పంటకు వెసులుబాటు ఉందని, ఇంత వరకు మామిడి రైతు చెట్టు నరికాడని కేసులు, జరిమానాలు విధించిన ఘటనలు లేవని పలువురు న్యాయవాదులు సైతం వివరిస్తున్నారు.