
టమాట బాక్సు రూ.450
పలమనేరు: టమాట ధరలు ఎట్టకేలకు పెరుగుతున్నాయి. పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు మంగళవారం రూ.450 దాకా పలికింది. సూపర్‌ఫైన్ రకం(తొలి కోతలు) రూ.500 దా టింది. ఆ మేరకు పెద్దపంజాణి మండలానికి చెందిన రైతు క్రిష్ణారెడ్డి తోటలోని టమాటాలు రూ. 500 పలికాయి. అయితే వైరస్ కారణంగా పంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఈ మాత్రం ధరలున్నా టమాటా రైతులకు మేలు కలిగినట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టీచర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇటీవల టీచర్ల బదిలీలు నిర్వహించిన విషయం విధితమే. అయితే ఈ బదిలీల్లో పలువురు టీచర్లు తమకు అన్యాయం జరిగిందని విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. సంబంధిత టీచర్ల అభ్యర్థనలను రెండు రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నష్టపోయిన 25 మంది టీచర్ల అభ్యంతరాలు(గ్రీవెన్స్)ను పరిష్కరించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.