
గిరిజన గ్రామాన్ని అభివృద్ధి చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో గిరిజన గ్రామ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని డీఆర్‌ఓ మోహన్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో గిరిజన శాఖ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో జిల్లాలోని పలమనేరు మండలం జగమర్ల గిరిజన గ్రామాన్ని సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. జగమర్ల గ్రామంలో మౌలిక సదుపాయాల పెంపు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో కీలకమైన అంశాలను గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జగమర్ల గ్రామానికి డీఆర్‌డీఏ, విద్య, వైద్యం, ఐసీడీఎస్, గ్రామీణ నీటి సరఫరా, పీఆర్, జిల్లా పంచాయతీ, వ్యవసాయ అనుబంధ, విద్యుత్, టెలీ కమ్యూనికేషన్స్, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శాఖల అధికారులు వెళ్లి పరిశీలించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి అందజేసే 144 అంశాల ఫార్మాట్‌ను సంబంధిత శాఖల అధికారులు వివరాలు నింపి పంపాలన్నారు. సంబంధిత శాఖలు అందజేసే వివరాలపై కలెక్టర్ ప్రతి నెలా జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్చిస్తారన్నారు. ఆయా శాఖలు అందజేసే వివరాలను కేంద్రప్రభుత్వానికి పంపుతామన్నారు. అదేవిధంగా పలమనేరులో మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.