
31 కిసాన్ డ్రోన్లు మంజూరు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాకు కిసాన్ డ్రోన్లు 31 దాకా మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఐదుగురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి డ్రోన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆ ఐదుగురిలో ఒకరిని డ్రోన్‌ఫైలెట్‌గా ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. డ్రాగో కంపెనీ డ్రోన్ మొత్తం ధర రూ.9.5 లక్షలు, విహంగ కంపెనీ ధర రూ.9.81 లక్షలు ఉందన్నారు. వీటిని 80 శాతం రాయితీతో ఇస్తామన్నారు. కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యుత్ అధికారుల నోటీసులు
గంగాధర నెల్లూరు : మండలంలోని అగర మంగళం పంచాయతీ పరిధిలోని దళిత వాడల్లో విద్యుత్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆపై గ్రామస్తులకు నోటీసులు అందజేశారు. దళిత గ్రామాలలో తనిఖీలు నిర్వహించి మీటర్లు లేని ఇండ్ల యజమానులకు నోటీసులిచ్చి జరిమానాలు విధించినట్లు గ్రామస్తులు తెలిపారు. అగర మంగళం గ్రామంలో దాదాపు 17 కుటుంబాలకు నోటీసులు అందించినట్టు పేర్కొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షను నిర్వహించారు. ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్‌లో కలిపి 5,854 మందికి 331 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌లో కలిపి 1,554 మందికి 95 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని సదుం, సోమల, పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మదర్ థెరీసా జూనియర్ కళాశాల, పలమనేరు ప్రభుత్వ జూనియర్, శ్రీ వాణి జూనియర్ కళాశాల, బంగారుపాళ్యం ప్రభుత్వ కళాశాలలను డీఐఈవో డా.ఆదూరు, శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

31 కిసాన్ డ్రోన్లు మంజూరు