
ప్రారంభోత్సవంలో అధికార దర్పం
● యథేచ్ఛగా ప్రొటోకాల్ ఉల్లంఘన ● ప్రజాప్రతినిధులకు అవమానం ● ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తికి శిలాఫలకంలో చోటు ● తెలిసి తప్పు చేసిన అధికారులు
సాక్షి టా్‌స్క్‌ఫోర్సు: ఎన్నికై న ప్రజాప్రతినిధులకు లేని గౌరవాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన ఓ నేతకు అఽధిక ప్రాధాన్యతతో ప్రొటోకాల్ కల్పించారు జిల్లా స్థాయి అఽధికారులు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులను అవమానపరిచిన ఘటన శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ పాలటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవంలో చోటు చేసుకుంది. వివరాలు.. పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, కాటిపేరి వద్ద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కలిసి రూ.3 కోట్లతో 58 ఎకరాల్లో పాలటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించారు. తక్షణం అద్దె భవనాలను ఏర్పాటు చేసి అప్పట్లో అడ్మిషన్లను నిర్వహించి పనులను వేగవంతం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. భవన నిర్మాణ పనులు పూర్తయ్యాక శుక్రవారం రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ సుమిత్‌కుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. అయితే ఆహ్వాన పత్రికలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ అధికారులు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆ ప్రాంత సర్పంచ్ సరితా సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతమ్మ తోపాటు ఎంపీపీ రామమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజుకి ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానపరిచారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన చల్లా రామచంద్రారెడ్డికి మాత్రం అగ్రతాంబూళం వేశారు. మండల స్థాయి ప్రజాప్రతినిధుల పేర్ల పైన ఆయన పేరును ప్రత్యేక అతిథిగా ముద్రించి అధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. ఇదిలావుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చల్లా రామచంద్రారెడ్డి అధికారులతో వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులే సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.