
హత్యాయత్నం కేసులో పదిమంది అరెస్టు
పలమనేరు: పట్టణంలో గత నెల 25వ తేదీన సునీల్‌కుమార్ అనే యువకుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో పదిమంది నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ నరసింహరాజు మంగళవారం తెలిపారు. అరెస్టయిన వారిలో కళ్యాణ్‌కుమార్, పవన్, సాయి, హరితో పాటు మరో ఆరుగురున్నారని తెలిపారు. ఇదే కేసులో మరో ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. జాతర సందర్భంగా రౌడీయిజం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. జాతరకు సంబంధించి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పాత కేసుల్లోని వారిని కూడా బైండోవర్లు చేసుకుంటున్నామని తెలిపారు.
తంబిగానిపల్లిలో చోరీ
కుప్పం: మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో కాపురమున్న బాబు ఇంట్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు చొరబడి 10 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు.. బాబు తన పెంకుటింట్లో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న గది తలుపు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బీరువాలో ఉంచిన 10 గ్రాముల బంగారు ఆభరణం, 250 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.4వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుప్పం పోలీసులు తెలిపారు.
జామీనుదారులకు జైలు
ఐరాల: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితులకు జామీను ఇచ్చిన పీలేరుకు చెందిన నాగరాజు, తండ్రి సిద్ధయ్యకు ఆరు నెలలు జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక సెషన్స్ కోర్టు జడ్జి నరసింహమూర్తి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంగళవారం ఎస్‌ఐ నరసింహులు తెలిపారు. ఎస్‌ఐ మాట్లాడుతూ జామీనుదారులను కోర్టులో హాజరు పరచుకుండా ఉన్నందుకు జడ్జి శిక్ష విధించినట్లు వెల్లడించారు.
విద్యుత్‌షాక్‌తో
యువకుడి మృతి
పుంగనూరు: తన సొంత ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటుండగా విద్యుత్‌షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రాంపల్లెలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రాంపల్లెకు చెందిన గోవిందప్ప కుమారుడు మణి(32) ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో ఇంటి కట్టడాలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై ఇంటి పై నుంచి నీటి సంపులో పడిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు మణిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

హత్యాయత్నం కేసులో పదిమంది అరెస్టు