
నిందితుల అరెస్ట్ చూపుతున్న పోలీసులు
గంగాధర నెల్లూరు : మండలంలోని పెద్ద కాలువ పంచాయతీ చెర్లోపల్లె వద్ద ఈనెల 26వ తేదీ రాత్రి జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవరాం ఈ మేరకు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మురుగన్ (47), నాగరాజు, బాలాజీ స్నేహితులని తెలిపారు. నాగరాజు వద్ద మురుగన్ అప్పు తీసుకున్నాడని, తిరిగి చెల్లించమని అడిగే క్రమంలో అసభ్యంగా దూషించాడన్నారు. దీంతో కక్ష పెంచుకున్న నాగరాజు ఎలాగైనా మురుగన్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడని చెప్పారు. ఇందుకు బాలాజీ సహాయం తీసుకుని ఘటనాస్థలానికి మురుగన్ తీసుకువచ్చాడన్నారు. ముగ్గురూ కలిసి మద్యం తాగి, మత్తులో ఉన్న మురుగన్ తలపై సుత్తితో కొట్టి హత్యచేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నాగరాజు, బాలాజీని చైన్నె– బెంగళూరు హైవే పక్కన బాలా త్రిపుర సుందరి కల్యాణమండపం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదించిన సీఐలు శంకర్, కుళ్లాయప్ప, ఎస్‌ఐలు రామాంజనేయులు, ఉమామహేశ్వర్‌రెడ్డి, సుబ్బమ్మతోపాటు ఐడీ పార్టీ సిబ్బంది సుధాకర్, రాజ్‌కుమార్‌ను అభినందించారు.