
చిత్తూరు అర్బన్: నగరంలోని కొంగారెడ్డిపల్లె విద్యానగర్‌లో శనివారం ఉదయం కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. వివరాలు.. పుత్తూరుకు చెందిన ఢిల్లీరాజు (48) అలియాస్ ఢిల్లీబాబుకు నగరికి చెందిన హేమలత (43)కు 2000లో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు బీటెక్ పూర్తిచేసి బెంగళూరులో పనిచేస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కవలలూ ఇంటర్ సెకెండియర్ పరీక్షలు ఈ ఏడాది రాశారు. అయితే ఢిల్లీరాజుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో హేమలత దాదాపు పదేళ్లుగా భర్తతో మాట్లాడడం లేదు.
ప్రస్తుతం ఢిల్లీరాజు ఎస్‌ఆర్‌పురంలోని పుల్లూరు జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. హేమలత చిత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే వారు నేరుగా మాట్లాడుకోక పోయినా నిత్యం గొడవలు పడుతుండేవారు. పిల్లలు మాత్రం త్వరలోనే వేరుగా వెళ్లిపోదామని తల్లికి సర్దిచెబుతూ ఉండేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. శనివారం ఉదయం పెద్దకుమారుడు తిరుపతి వెళ్లాడు. మరో కొడుకు ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోయాడు. ఇదే అదనుగా భావించిన ఢిలీరాజు ఇంకో కొడుకుని బెడ్‌రూమ్‌లోకి నెట్టేసి గదికి తాళం పెట్టేశాడు. అప్పుడే స్నానం చేసి బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన భార్యపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
తల, మెడ, గొంతుపై నరికేశాడు. దీంతో కేకలు వేస్తూ హేమలత కుప్ప కూలిపోగా.. కుమారుడు తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి సుత్తితో తాళం పగలగొట్టి చూడగా హేమలత హృదయవిదారకస్థితిలో చనిపోయి కనిపించింది. నిందితుడు హత్యాయుధంతోపాటు ద్విచక్రవాహనంలో పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, వన్‌టౌన్ సీఐ నరసింహరాజు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్లూస్ బృందం ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు సీఐ తెలిపారు.