
వైభవంగా తిరుపతి గంగ జాతర
● భక్తులతో హోరెత్తిన ఆలయం ● భక్తి శ్రద్ధలతో పొంగళ్ల నివేదన ● జాతర చివరి రోజున పోటెత్తిన భక్తులు ● గంగజాతర వేషాలతో పులకించిన తిరునగరి
తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 6వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన గంగ జాతర వారం రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగింది. రోజువారీ విభిన్న వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం అర్ధరాత్రి అమ్మవారికి మహాశాంతి అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మొక్కుబడిలో భాగంగా వేపాకు చీరలతో గంగమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జాతర చివరిరోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష సంఖ్యలో భక్తులు వివిధ పౌరాణిక, జానపద, సీ్త్ర వేషాలు ధరించి తిరు నగరిలోని పురవీధుల్లో సందడి చేశారు. భక్తజనంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు సందడి నెలకొంది. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద భక్తులు మజ్జిగ, అంబళ్లు పంపిణీ చేశారు.
గంగమ్మ విశ్వరూప దర్శనంతో పులకించనున్న భక్తజనం
శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో చివరిరోజు బుధవారం తెల్లవారుజామున విశ్వరూపంతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంకమట్టితో సర్వాంగ సుందరంగా అమ్మవారి విశ్వరూప ప్రతిమ కొలువు తీరనుంది. అమ్మవారి విశ్వరూప ప్రతిమ చంపను పేరంటాల వేషధారుడు బుధవారం తెల్లవారుజామున నరకడంతో జాతర సమాప్తం అవుతుంది.

వైభవంగా తిరుపతి గంగ జాతర