
సెమీ కండక్టర్ తయారీలో సంక్లిష్టమైన ఫ్యాబ్రికేషన్ ప్రక్రియలకు సాంకేతిక భాగస్వామిని పొందడంలో ఇబ్బందులు పడుతున్నట్లు జోహో తెలిపింది. ఈ కారణంగా 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5,830 కోట్లు) చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా నిలదొక్కుకోవాలన్న భారత్ ఆకాంక్షలకు ఇలాంటి సంఘటనలు సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
టెక్నాలజీ భాగస్వామిని కనుగొనడంలో సవాళ్లు
సెమీకండక్టర్ తయారీలోకి ప్రవేశించడానికి, మార్గనిర్దేశం చేయడానికి జోహో వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ఈమేరకు కంపెనీ విస్తృతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ తగిన పార్ట్‌నర్‌ను కనుగొనలేకపోయినట్లు సంస్థ తెలిపింది. సెమీకండక్టర్ పరిశ్రమకు అత్యంత ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమని భావిస్తోంది. నమ్మకమైన భాగస్వామి లేకపోవడంతో చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేయాలని నిర్ణయించింది.
ముందుగా కర్ణాటకలో సెమీకండక్టర్ ఫెసిలిటీలో 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ.3,332 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది 460 మందికి ఉపాధి సృష్టిస్తుందని, రాష్ట్రంలో మొదటి చిప్ తయారీ ప్రాజెక్టుగా మారుతుందని భావిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: బంగారమా..? మాకొద్దు బాబోయ్..!
భారత్ లక్ష్యాలపై ప్రభావం..?
సెమీకండక్టర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ చిప్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ కృషి చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం బిలియన్ల విలువైన ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. కానీ జోహో ఎదుర్కొంటున్న సవాళ్లు దేశీయ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడంలో నిర్మాణాత్మక అడ్డంకులను హైలైట్ చేస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిప్ తయారీకి ముందుకువస్తున్న కంపెనీలకు అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.