
ఐదేళ్ల పాటు నిషేధం
మరో నలుగురిపైనా ఇదే చర్య
రూ.120 కోట్ల పెనాల్టీ
న్యూఢిల్లీ: కంపెనీ ఖాతాలను వండి వార్చడం, నిధుల మళ్లింపు చర్యలకు పాల్పడిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, మరో నలుగురిపై సెబీ కఠిన చర్యలకు దిగింది. ఐదేళ్ల పాటు సెక్యూరిటీల మార్కెట్లలోకి ప్రవేశించకుండా వీరిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి పదవులూ చేపట్టకుండా నిషేధించింది. అలాగే రూ.120 కోట్ల పెనాల్టీని విధించింది.
కపిల్, ధీరజ్‌తోపాటు డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ వాధ్వాన్, మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సారంగ్ వాధ్వాన్, మాజీ జాయింట్ ఎండీ, సీఈవో హర్షిల్ మెహతా, మాజీ సీఎఫ్‌వో సంతోష్ శర్మపై ఈ చర్యలు ప్రకటించింది. 181 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. 2006 నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, కీలక పదవుల్లో ఉన్న వారు మోసపూరితంగా కంపెనీ నిధులను ప్రమోటర్లకు చెందిన ‘బాంద్రా బుక్ ఎంటిటీస్’(బీబీఈలు)కు బదిలీ చేసినట్టు.. 2019 మార్చి 31 నాటికి బీబీఈలకు డీహెచ్‌ఎఫ్‌ఎల్ మంజూరు చేసిన రుణాలు రూ.14,040 కోట్లకు చేరినట్టు సెబీ తేల్చింది.
ఎలాంటి వ్యాపారం, ఆస్తుల్లేని ప్రమోటర్ల సంస్థలకు పెద్ద ఎత్తున అన్‌సెక్యూర్డ్ రుణాలను మంజూరు చేశారని.. ఇందుకు ఎలాంటి ముందస్తు మదింపు విధానాలను అనుసరించలేదని గుర్తించింది. పైగా వీటిని రిలేటెడ్ పార్టీ లావాదేవీలుగా కాకుండా రిటైల్ హౌసింగ్ రుణాలుగా పేర్కొన్నట్టు తేలింది. ఆయా సంస్థలు (బీఈఈలు) రుణాలపై వడ్డీ చెల్లించకపోయినప్పటికీ.. కల్పిత వడ్డీ ఆదాయాన్ని చూపిస్తూ 2007–08 నుంచి 2015–16 మధ్య కాలంలో నష్టాలకు బదులు లాభాలు పెరుగుతున్నట్టు చూపించారని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 39 బీఈఈలకు ఇచ్చిన రూ.5,662 కోట్ల రుణాల్లో.. 40 శాతాన్ని ప్రమోటర్లకు చెందిన సంస్థలకు తిరిగి మళ్లించినట్టు తేలి్చంది.