
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది.
ఎస్‌సీ, ఎస్‌టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గర్వకారణం...
1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది.
– నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి
ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మూడవ స్తంభం
స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది.
– భగవత్ కిసన్‌రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి