
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్) నీరసించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 33 శాతం తగ్గిపోయి 1.69 బిలియన్ డాలర్లు (14,365 కోట్లు)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు ఇందుకు దారితీసినట్టు తెలిపింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇనిస్టిట్యూషన్స్ 2.53 బిలియన్ డాలర్లను (రూ.21,505 కోట్లు) రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే సగానికి తగ్గి 1,048 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం 643 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 486 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కంటే 32 శాతం అధికమయ్యాయి.
దేశీ పెట్టుబడుల అండ..
‘దేశీ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కీలక చోదకంగా మారాయి. భారత రియల్ ఎస్టేట్‌లో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 2021లో 16 శాతంగా ఉంటే, అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ 2024 నాటికి 34 శాతానికి చేరింది’ అని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజ్ఞిక్ తెలిపారు. ఇక 2025 మొదటి ఆరు నెలల కాలంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో దేశీ పెట్టుబడుల వాటా 48 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం.. అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సాయపడ్డాయని, మొదటి ఆరు నెలల్లో మొత్తం పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లకు దూసుకువెళ్లాయని తెలిపారు.
ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 15 శాతం తగ్గి 2,998 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మొదటి ఆరు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 2,594 మిలియన్ డాలర్ల నుంచి 1,571 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 53 శాతం ఎగసి 1,427 మిలియన్ డాలర్లకు చేరాయి. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొప్రయిటరీ బుక్‌లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, లిస్టెడ్ రీట్‌లు సంస్థాగత పెట్టుబడిదారుల కిందకు వస్తాయి.