చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?

Government Oil Companies Are Expected To Lose September Of The Current Fiscal Year 2022-23 - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్‌ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. 

చమురు పీఎస్‌యూలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్‌పీజీ విక్రయాలలో మార్కెటింగ్‌ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్‌ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. 

నవంబర్‌లో 
చమురు పీఎస్‌యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్‌)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్‌ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్‌ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్‌ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్‌ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్‌యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్‌ మార్జిన్ల(జీఆర్‌ఎం)లో బ్యారల్‌కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్‌ రిటైల్‌ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. 

ఇబిటా నష్టాలు 
మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్‌యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్‌ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్‌ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం.  

కంపెనీలవారీగా... 
నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్‌ రూ. 6,900 కోట్లు, హెచ్‌పీసీఎల్‌ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్‌యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్‌ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్‌పీసీఎల్‌ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్‌), బీపీసీఎల్‌  రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే    సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top