
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి జులైలో రూ.1,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పెట్టుబడులు రూ.2,081 కోట్లతో పోల్చి చూస్తే ఏకంగా 40 శాతం తగ్గాయి. ఈ ఏడాది మే నెలలోనూ బంగారం ఈటీఎఫ్‌లు రూ.292 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.
పసిడి ధరలు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉండడంతో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
అంతకుముందు వరుసగా రెండు నెలల్లో.. ఏప్రిల్‌లో రూ.6 కోట్లు, మార్చిలో 77 కోట్ల చొప్పున గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,277 కోట్లుగా ఉన్నాయి.
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలోకి పసిడికి సైతం చోటు కల్పిస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జూలై చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు రూ.67,634 కోట్లకు పెరిగాయి. జూన్ చివరికి ఉన్న రూ.64,777 కోట్లతో పోల్చి చూస్తే 4.4 శాతం వృద్ధి చెందాయి.
78.69 లక్షల ఫోలియోలు
గోల్డ్ ఈటీఎఫ్‌లలో మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతా) జూలై చివరికి 78.69 లక్షలకు చేరాయి. 2.15 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. ‘బంగారం గత రెండేళ్లలో బలమైన పనితీరు చూపించినప్పటికీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇన్వెస్టర్లకు కష్టమే. చాలా మంది ఇన్వెస్టర్లు హెడ్జింగ్ దృష్ట్యా బంగారానికి కొంత పెట్టుబడులు కేటాయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లో ఉన్న దృష్ట్యా అప్రమత్తత అవసరం’ అని జెర్మైట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ సూచించారు.
స్థూల ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లలో అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్ట్‌ఫోలియో వైవిధ్యం దృష్ట్యా బంగారానికి డిమాండ్ కొనసాగుతున్నట్టు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు.