బ్యాడ్‌ బ్యాంక్‌కు సావరిన్‌ గ్యారంటీ

FM Nirmala Sitharaman announces Rs 30,600 cr govt guarantee for Bad Bank - Sakshi

రిసిట్స్‌కు హామీగా రూ.30,600 కోట్లు

ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం

ఆర్థిక మంత్రి సీతారామన్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న  ప్రతిపాదిత నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్‌) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకరులకు గురువారం ఈ విషయాన్ని తెలిపారు.

  ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌... ఎన్‌ఏఆర్‌సీఎల్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ సమావేశం బుధవారమే ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్ల నిధుల కేటాయింపు జరుపుతూ  నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి తాజాగా తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్‌  ఈ సందర్భంగా తెలిపారు. 2018 మార్చి నుంచీ చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

నవంబర్‌కల్లా లైసెన్సులు
బ్యాంకింగ్‌ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోషియేషన్‌ (ఐబీఏ) బ్యాడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. లైసెన్స్‌ మంజూరీకి గత నెల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు ఐబీఏ దరఖాస్తు చేసింది. వచ్చే రెండు నెలల్లో దీనికి ఆర్‌బీఐ ఆమోదముద్రవేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  

నిర్వహణా తీరు ఇది...
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్‌ నుంచి మొండిబకాయి (ఎన్‌పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్‌ ఉంటాయి.  ఏదైనా ఎన్‌పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో  నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది.  

రిసిట్స్‌కు గ్యారంటీ ఐదేళ్లు...
ఆర్థిక సేవల కార్యదర్శి దేబాíÙష్‌ పాండా తెలిపిన సమాచారం ప్రకారం, రిసిట్స్‌కు సావరిన్‌ గ్యారంటీ ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. రిసిట్స్‌ విలువకు ఎన్‌ఏఆర్‌సీఎల్‌ ఫీజుకూడా చెల్లించాలి. తొలి దశలో దీనికి 0.25 శాతం ఫీజు ఉంటుంది. మొండిబకాయిల పరిష్కారం విషయంలో ఆలస్యం అయితే ఈ ఫీజు 0.5 శాతం వరకూ పెరుగుతంది.  ఈ బ్యాకప్‌ వ్యవస్థ మొత్తం మొండిబకాయిల భారం సత్వర పరిష్కారానికి, బ్యాంకింగ్‌కు త్వరిత గతిన నిధుల లభ్యతకు, తద్వారా తదుపరి బ్యాంకింగ్‌ రుణ పంపిణీ పురోగతికి దోహదపడే అంశమని ఆయన వివరించారు.

2021–22 బడ్జెట్‌ చూస్తే...
2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ‘‘మొండిబకాయిల నిర్వహణకు అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఏర్పాటు  జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

వాటాలు ఇలా..
ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో 16 మంది షేర్‌హోల్డర్లు ఉంటారు. ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో 12 శాతం వాటాతో లీడ్‌ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్‌ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్‌ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నిర్వహిస్తుందని (కొనుగోలు చేస్తుందని) అంచనా.

‘4ఆర్‌’ విధానం
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపడ్డానికి ‘4ఆర్‌’ వ్యూహాన్ని కేంద్రం అనుసరిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. సమస్య గుర్తింపు (రికగ్నేõÙన్‌), పరిష్కారం (రిజల్యూషన్‌), అవసరమైన మూలధన కల్పన (రీక్యాపిటలైజేషన్‌), సంస్కరణలు (రిఫార్మ్‌) ‘4ఆర్‌’లో ఉన్నట్లు వివరించారు. కాగా, బ్యాడ్‌ బ్యాంక్‌ ఏదైనా ఎన్‌పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో  నష్టం జరిగే సందర్భాలు తక్కువగానే ఉండవచ్చని, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందని  ఇప్పుడు ఊహించడం సరికాదని ఈ సందర్భంగా సూచించారు. అందువల్ల రిసిట్స్‌కు ప్రభుత్వ గ్యారెంటీ వల్ల ప్రస్తుతానికి ఆర్థిక భారం  కేంద్రంపై ఉండబోదని స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top