
‘రివర్‌సైడ్’కు ఆదరణ కరువు
గోదావరి నదీ తీరంలోని
విడిది కుటీరాల తొలగింపు
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం సందర్శించిన భక్తులతోపాటు పర్యాటకులు గోదావరి నదీ తీరంలో బస చేసే విధంగా ఏర్పాటు చేసిన విడిది కుటీరాలను తొలగిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గోదావరికి వరదలు వస్తే మునిగిపోతుందనే కారణంతోపాటు పర్యాటకుల నుంచి ఆదరణ లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. గత జనవరిలో భద్రాచలం నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఏరు ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విడిది (రివర్‌సైడ్ క్యాంప్) కుటీరాలు ఏర్పాటు చేయించారు. ప్రారంభం నుంచీ పర్యాటక ఆదరణ లభించలేదు. మొదటిసారి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని 17 మంది విడిది చేశారు. ఆ తర్వాత ఒకరిద్దరు తప్ప ఎప్పుడూ పర్యాటకులతో కుటీరాలు నిండింది లేదు. చార్జీలు భారీగా ఉండటంతో పర్యాటకులు ఆసక్తి చూపడంలేదని భావించిన అధికారులు.. చార్జీలు తగ్గించారు. ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ముగ్గురు, నలుగురు సభ్యులు కలిగిన కుటుంబం బస చేసేలా సిద్ధం చేశారు. 12 గంటలు బస చేసే పర్యాటకులకు రూ.500 చార్జీతో పాటు వారి అభ్యర్థన మేరకు భోజన వసతి కల్పించాలని నిర్ణయించారు. అయినా ఆదరణ లేకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. దీంతో నిర్వహణ బాధ్యతను డీఆర్‌డీఏ అధికారుల నుంచి స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఎండాకాలం తాటాకు పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా మార్పులేకపోవడంతో వాళ్లు కూడా వదిలేశారు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయి, రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇక చండ్రుగొండ మండలం బెండాలపాడు, దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప, పాల్వంచ మండలం కిన్నెరసాని, ఐటీడీఏ గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన గిరిజన పల్లె వాతావరణ ఆవాసాలను పర్యాటకులు తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు సుమారు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. వాటికి కూడా ఆదరణ లేకపోవడంతో ప్రజాధనం వృథా అయిందని పలువురు పేర్కొంటున్నారు.

‘రివర్‌సైడ్’కు ఆదరణ కరువు