
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
అప్రమత్తంగా ఉండాలి
● వర్షాల నేపథ్యంలో హెల్ప్‌లైన్ల ఏర్పాటు
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు
సూపర్‌బజార్(కొత్తగూడెం)/కొత్తగూడెంటౌన్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్‌రాజు సూచించారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. వర్షాలతో నదులు, వాగులు, చెరువులు పొంగి రోడ్లపైకి వరదనీరు చేరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, బయటకు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు, నదుల వద్దకు సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లోని హెల్ప్‌లైన్ల నంబర్లకు, డయల్ 100కు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు సమాచారం అందించి సహాయం పొందవచ్చని వివరించారు. రెవెన్యూ, పోలీస్, రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల్లో, ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు డీడీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
హెల్ప్‌లైన్ నంబర్లు
08744–241950 – కలెక్టర్ కార్యాలయం
08743–232444 – భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం
వాట్సాప్ నంబర్లు
9347910737 –
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం
9392919747– కలెక్టర్ కార్యాలయం

కమనీయంగా రామయ్య కల్యాణం