
కార్పొరేషన్‌లో అధ్వానం..
కొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ కార్పొరేషన్‌లోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. సీసీ, బీటీ రోడ్లలో గుంతలు పడ్డాయి. ప్రధాన పోస్టాఫీసు సెంటర్ నుంచి మొదలుకొని కోర్టు వరకు, అక్కడి నుంచి శేషగిరినగర్ వరకు కూడా అడుగడుగుకో గుంత ఉంది. ఆ రూట్‌లో భారీ వాహనాలు నడవడంతో గుంతలు ఏర్పడ్డాయి. పాతకొత్తగూడెం, రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్ ఏరియాలో మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్వకాలు జరిపి పూడ్చకుండానే వదిలేశారు. వర్షాలకు గుంతల్లో నీరు నిల్వడంతో చిన్న పిల్లలు పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. సెవెన్‌హిల్స్ ఏరియా రోడ్డు నుంచి బూడిదగడ్డ వరకు కూడా రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వైపులా తవ్వకాలు జరిపారు. ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. సూపర్‌బజార్ నుంచి రైతుబజార్ వెళ్లే రోడ్డులో కూడా గుంతలు అధికంగా ఉన్నాయి. రోడ్లపై ప్రయాణించలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు.
రోడ్ల నిర్మాణం చేపట్టాలి
పాతకొత్తగూడెంలోని పాతూరులో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారాయి. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం తవ్వకాలు జరిపి పూడ్చకుండా వదిలివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. గుంతలను పూడ్చాలి.
–ఇందిరమ్మ, పాతకొత్తగూడెం
●