
బోన్‌లెస్ చేపలతో రుచి, లాభాలు!
సూపర్‌బజార్(కొత్తగూడెం): మునగ సాగు తదితర అంశాలపై ప్రజలకు వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఈసారి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించారు. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం చేపల వ్యాపారులు, మత్స్యకారులతో సమావేశమై చేపల్లో ముళ్లు తీయడంపై ప్రత్యేకంగా వివరిస్తూ.. వీటితో తయారుచేసే వంటలు, ఆదాయ మార్గాలపై అవగాహన కల్పించారు. బోన్‌లెస్ చేపలతో టిక్కా తదితర వంటలు చేస్తే ప్రజలకు కొత్త రుచులు అందించొచ్చని.. తద్వారా వారికి పోషకాహారం అందడమేకాక మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అలాగే చేపల తలలు, మిగిలిన భాగాలతో సూప్ తయారుచేస్తే అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఇవన్నీ పోగా మిగిలిన వ్యర్థాలతో ఎరువు తయారీకి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో కలెక్టర్ స్వయంగా చేపల నుంచి ముల్లులు తీస్తూ అవగాహన కల్పించగా, మత్స్యకారులు, ఆదివాసీలు, చేపల పెంపకం, అమ్మకంపై ఆధారపడి జీవించే కుటుంబాలు, ఎస్‌హెచ్‌జీల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పాటిల్ సూచించారు.
9, 10వ తేదీల్లో మెగా ఆధార్ క్యాంపు
ఆధార్ కార్డుల్లో అవసరమైన సవరణల కోసం ఈనెల 9, 10 తేదీల్లో మెగా ఆధార్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డుల్లో తప్పులున్నవారు, కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేరు మార్పు, పుట్టిన తేదీ, చిరునామా సవరణ, మొబైల్ నంబర్ అప్‌డేట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో కొన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని, మరికొన్ని మాత్రం ఆధార్ సేవా కేంద్రం నుంచే చేయాల్సి ఉంటుందని తెలిపారు.
మరమ్మతులకు అంచనాలు రూపొందించండి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతు పనులకు అంచనాలు రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన జూనియర్ కళాశాలను సందర్శించారు. ప్రాక్టికల్ ల్యాబ్‌లు, రెనవేషన్ కంప్యూటర్ ల్యాబ్ సామగ్రి, ఎలక్ట్రికల్ ల్యాబ్ సామగ్రి, బాలుర, బాలికల టాయిలెట్ల మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనుల వంటి వాటికి అంచనాలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కళాశాల ఆవరణలోని జీహెచ్‌ఎస్ తరగతి గదులను కూడా రిపేర్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్, ఇన్‌చార్జ్ డీఐఈఓ సులోచనారాణి, పాఠశాల హెచ్‌ఎం సబితా సంధ్యారాణి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డీఈ నాగేందర్ పాల్గొన్నారు.
తయారీ విధానాన్ని వివరించిన కలెక్టర్

బోన్‌లెస్ చేపలతో రుచి, లాభాలు!