
డిగ్రీ.. డీలా
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు తగ్గుతున్న ఆదరణ ● దోస్త్ గడువు ముగిసినా సగం సీట్లు ఖాళీ ● జిల్లాలోని ఆరు కాలేజీల్లో మూడింటికే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ● గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల్లాలోనూ భర్తీకాని సీట్లు
● పాల్వంచలో
అధికంగా భర్తీ..
2025–2026లో మే 30వ తేదీ నుంచి దోస్త్ ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ఈ నెల 9 వరకు, రెండో విడత 13 నుంచి 19 వరకు, మూడో విడత 23 నుంచి 28 వరకు నిర్వహించారు. రేపటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభంకానున్నాయి. మూడు విడతలుగా అడ్మిషన్లు చేపట్టినా విద్యార్థులు నామమాత్రంగానే చేరారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నా ఆదరణ లేదు. పాల్వంచలోని కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధతో ప్రచారం చేపట్టగా జిల్లాలోని మిగతా కాలేజీలకంటే అధికంగా విద్యార్థులు చేరారు. జిల్లాలోని 10 డిగ్రీ కళాశాలల్లో 3,980 సీట్లు ఉండగా, ఇప్పటివరకు 1,813 మంది చేరారు. ఇంకా 2,167 ఖాళీలు ఉన్నాయి.
పాల్వంచరూరల్: అడ్మిషన్లు లేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు డీలా పడుతున్నాయి. డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. సంప్రదాయ డిగ్రీ కోర్సులపై విముఖత చూపుతున్నారు. అడ్మిషన్ ప్రక్రియ దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ) గడువు ముగిసినా కాలేజీల్లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక పాల్వంచ, అంకంపాలెంలలో గిరిజన సంక్షేమ శాఖ బాలికల డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, మణుగూరులో గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కాగా దమ్మపేట మండలంలోని అంకంపాలెం గిరిజన బాలికల గురుకులాన్ని రెండు, మూడేళ్ల క్రితం అశ్వారావుపేటలోని పెదవాగుకు తరలించారు. జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందులలోనే రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలినచోట్ల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్స్‌తో నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుండగా, ఈ ఏడాది అధికంగా తగ్గుముఖం పట్టాయి
డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల భర్తీ ఇలా..
మొత్తం భర్తీ ఖాళీలు గతేడాది
సీట్లు అయినవి భర్తీ
ప్రభుత్వ కళాశాలలు
పాల్వంచ 660 313 347 420
కొత్తగూడెం 420 177 243 134
భద్రాచలం 840 311 529 470
మణుగూరు 360 120 240 180
ఇల్లెందు 300 80 220 134
అశ్వారావుపేట 280 289 191 303
గురుకుల కళాశాలలు
కొత్తగూడెం 280 103 177 142
పాల్వంచ 280 172 108 200
మణుగూరు 280 160 120 200
పెదవాగు 280 88 192 62
● విద్యార్థుల చూపంతా ఇంజనీరింగ్ వైపే..
విద్యార్థులు అధికంగా ఇంజనీరింగ్ విద్యవైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడంలేదు. గతంలో ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు లభించేవి. సీట్ల కోసం పైరవీలు కూడా చేసేవారు. కానీ క్రమంగా అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. కాగా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయితే, అక్కడ సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశం ఉంది. దీనికితోడు అడ్మిషన్లకు స్పెషల్ డ్రైవ్ కూడా చేపడ తామని, ఇంకా చేరనివారు ఎవరైనా ఉంటే
వినియోగించుకోవచ్చని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు.