
‘సర్వే’శ్వరా..!
● గౌరవ వేతనం కోసం ఎన్యుమరేటర్ల ఎదురుచూపులు ● గతేడాది నవంబర్‌లో సమగ్ర కుటుంబ సర్వే ● ఏడు నెలలు గడిచినా చెల్లింపులు చేపట్టని ప్రభుత్వం
కష్టపడి పనిచేశాం
సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను రాత్రింబవళ్లు కష్టపడి ఆన్‌లైన్ చేశాం. రోజుకు 30 నుంచి 40 వరకు దరఖాస్తుల వివరాలు నమోదు చేశాం. వీటి డబ్బుల కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తున్నాం.
– భూక్యా కిషోర్, డేటా ఎంట్రీ ఆపరేటర్
విడుదల చేయాలి
ఒక్కో ఆపరేటర్ 400 నుంచి 550 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశారు. ఆ ప్రకారం పారితోషికం చెల్లించాల్సి ఉంది. త్వరగా విడుదల చేసేలా జిల్లా అధికారులు చొరవ తీసుకోవాలి.
–పి.సతీష్, డేటా ఎంట్రీ ఆపరేటర్
చుంచుపల్లి: గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఏడు నెలలు గడిచినా ఆ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటివరకు గౌరవ వేతనం చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తామనే విషయం కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఎన్యుమరరేటర్లు, ఆపరేటర్లు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతోపాటు సంక్షేమ పథకాల అమలుకు గతేడాది నవంబర్ 6 నుంచి 21 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే చేపట్టింది. జిల్లాలో సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, మున్సిపల్ వార్డు అధికారులు, సెర్ప్ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లుగా పని చేశారు. ఒక్కొక్కరు 150 కుటుంబాల వరకు సర్వే చేశారు. అనంతరం నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు వివరాలను 1,753 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
4,372 మంది సిబ్బంది సేవలు
సమగ్ర కుటుంబ సర్వేలో 2,383 మంది ఎన్యుమరేటర్లు, 236 మంది సూపర్‌వైజర్లు పనిచేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 103 వార్డులు, 481 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,36,407 కుటుంబాల నుంచి సుమారు 20 రోజులపాటు వివరాలు సేకరించారు. ఎన్యుమరేటర్లకు రూ.10 వేల చొప్పున, సూపర్ వైజర్లకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పున ఇస్తామని చెప్పింది. మొత్తం ఆపరేటర్లందరికీ కలిపి సుమారు రూ.3.40 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు చెల్లించకపోవడంతో ఎన్యుమరేటర్లు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సర్వే జరిపిన కుటుంబాలు: 3,36,407
సేవలందించిన సిబ్బంది: 4,372
చెల్లించాల్సి పారితోషికం (సుమారు) : రూ.3.40 కోట్లు

‘సర్వే’శ్వరా..!

‘సర్వే’శ్వరా..!