
సంప్రదాయానికే మొగ్గు..
ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపని రైతులు
● జిల్లాలో మరీ తక్కువగా నూనె పంటల సాగు ● ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న కర్షకులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, వాణిజ్య పంటలు పత్తి, మిర్చి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయిల్‌పామ్, మునగసాగు విషయంలో మాత్రం అధికా రుల కృషి ఫలిస్తోంది. నూనె పంటలైన వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, మద్దతు ధర లభిస్తుందని అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా సుముఖత వ్యక్తం చేయడంలేదు. దీంతో జిల్లాలో సంప్రదాయ పంటలే అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్‌లో వరి 1,60,956 ఎకరాల్లో, మొక్కజొన్న 85,544 ఎకరాల్లో, పత్తి అత్యధికంగా 2,04,632 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆయిల్‌పామ్‌లో ప్రథమస్థానం..
వ్యవసాయ, ఉద్యానశాఖల కృషితో ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంటోంది. అంతర పంటలకు సాగుకు అవకాశం, రాయితీలు అధికంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాలకు తోటలు దెబ్బతినకపోవడంతో పలువురు రైతులు ఆయిల్‌పామ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈ వానాకాలంలో 75 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు సిద్ధమయ్యారు. ఇక నూనె పంటల్లో వేరుశెనగ 2,791 ఎకరాల్లో సాగు చేయనుండగా మిగతా పంటలు నామమాత్రంగా సాగు చేయనున్నారు. ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మునగ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ విస్తృత ప్రచారం చేయడంతో కొందరు రైతులు మునగ వైపు మొగ్గు చూపుతున్నారు. గత వానాకాలంలో 550 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 2,500 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. కూరగాయల సాగుతో ఎక్కువ ఆదాయం లభించే అవకాశం ఉన్నా రైతులు ఆ దిశగా దృష్టి సారించడంలేదు. దీంతో జిల్లా ప్రజల కోసం కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తే సంప్రదాయ పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.