
మోకాళ్లపై గని కార్మికుల నిరసన
మారుపేర్ల సమస్య
పరిష్కరించడంలేదని ఆవేదన
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్, సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట 11 ఏరియాల బాధితులు ప్లకార్డులతో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. గెస్ట్‌హౌస్‌లో డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అధ్యక్షతన కంపెనీస్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహిస్తుండగా బయట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో ఆర్‌ఎస్‌సీ సమావేశంలో మారుపేర్ల సమస్య పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నా, అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రెండు ప్రాణాలను బలితీసుకున్న సింగరేణి యాజమాన్యం తీరు సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్క శ్రావణ్ గౌడ్, తిరుమల శ్రీనివాస్, ఈర్ల రాజయ్య, డీఎస్ బాబు, హరీష్ యాదవ్, వంగా సంతోష్, పార్దపల్లి హరీష్, పొన్నం వెంకటేశ్, కొమురమ్మ, ప్రదీప్, జిల్లాల శ్రావన్, గుర్రం సుధాకర్, అజ్మీర నరేష్, అంబటి రాజశేఖర్, ఆకుల కిరణ్, మోత్కరి రవికుమార్, కలావతి, ఇప్టూ నాయకులు గౌని నాగేశ్వరావు, ఎన్.సంజీవ్, శ్రవణ్, శ్రీనివాస్, వెంకటేశ్, రవి, సందీప్, బిందు, కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతి ఆధారంగా
ఉద్యోగ అవకాశం కల్పించాలి
డిపెండెంట్ ఉద్యోగాలకు 10వ తరగతి ఆధారంగా ఉద్యోగ అవకాశం కల్పించాలని టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రం డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సమావేశం సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించకుండా గెస్ట్‌హౌస్‌లో నిర్వహించటం సరికాదని అన్నారు. ఈ సందర్బంగా ర్యాలీగా వెళ్లిన నాయకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
సింగరేణి యాజమాన్యంతో
గుర్తింపు సంఘం నిర్మాణాత్మక సమావేశం
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రుతో గుర్తింపు సంఘం 51వ నిర్మాణాత్మక సమావేశం నిర్వహించింది. నాయకులు పలు సమస్యలను లేవనెత్తారు. యాక్టింగ్ క్లర్క్‌లను క్రమబద్ధీకరణ చేయాలని, సెక్యూరిటీ గార్డు ఖాళీలను అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయాలని, ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, రాష్ట్ర లేబర్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న డ్రిల్ ఆపరేటర్ కేడర్ స్కీమ్ కేసును పరిష్కరించాలని, సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు ఉత్పత్తి చేయించాలని, కారుణ్య నియమకాలు, గని ప్రమాద మృతుల వారసులకు విద్యార్హతలకు తగిన ఉద్యోగం ఇవ్వాలని గుర్తింపు సంఘం నాయకులు కోరగా.. వీలైనంత త్వరలో పరిష్కరిస్తామ డైరెక్టర్ తెలిపారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ గైర్హాజరు ఉద్యోగుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, భూగర్భ గనుల్లో ఉద్యోగుల హాజరుశాతం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు.

మోకాళ్లపై గని కార్మికుల నిరసన