
బిల్లులు రాట్లే..
● ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఆవేదన ● నిలిచినపోయిన నాలుగు నెలల చెల్లింపులు ● పెండింగ్‌లోనే రూ.41.50 లక్షల గౌరవ వేతనం
పాల్వంచరూరల్: ‘విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని అఽధికారులు ఆదేశిస్తారు. అప్పడప్పుడూ తనిఖీలు చేస్తూ వంటలు బాగాలేవని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ మాకు బిల్లులు రాకపోయినా ఎవరూ పట్టించుకోరు.’ అని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న ఏజెన్సీలకు నాలుగు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. జనవరి నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పు చేసి పిల్లలకు వంటలు వండిపెడుతున్నారు. కిరాణం, కూరగాయల దుకాణాల్లో ఖాతా రూ. వేలల్లో ఉంటోందని నిర్వాహకులు వాపోతున్నారు.
గౌరవ వేతనమూ పెండింగే..
జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ 1,309 ఉండగా 112 హైస్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో వేల మంది విద్యార్థులు ఉండగా వంట నిర్వాహకులు 2,075 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం గౌరవ వేతనం కింద నెలనెలా రెండువేల చొప్పున చెల్లిస్తోంది. మార్చి నెల నుంచి రూ.41.50 లక్షల గౌరవ వేతనాలు రావాల్సిఉంది.
పేరుకుపోతున్న కోడిగుడ్ల బకాయిలు
విద్యార్థులకు కోడిగుడ్డు వండి వడ్డించేందుకు ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున చెల్లిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి సుమారు రూ.10 లక్షలకు పైగా గుడ్ల బకాయి పెండింగ్‌లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలకు నిధులు ఖర్చు చేస్తున్నారు. కేంద్రం ద్వారా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున ఖర్చు భరిస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.19, 6 నుంచి 8వ తరగతులకు రూ.9.22, 9 నుంచి 10వ తరగతి వరకు రూ.11.67 చొప్పున ఖర్చు చేస్తున్నాయి.
కిచెన్ షెడ్లులేక అవస్థలు
జిల్లాలోని పలుచోట్ల పాఠశాలల్లో కిచెన్ షెడ్లు సక్రమంగా లేవు. పాల్వంచ మండలం నాగారం హైస్కూల్లో కిచెన్ షెడ్‌ను నిర్మించలేదు. దీంతో వంట చేసేందుకు ఇక్కట్లు తప్పడంలేదు. వర్షాకాలంలో వంటలు చేయాలంటే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కత్తి మీద సాములాగా మారింది. అధికారులు స్పందించి కిచెన్ షెడ్ నిర్మించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
అప్పులు తెచ్చి వండి పెడుతున్నాం
మధ్యాహ్న భోజనం బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తెస్తున్నాం. గౌరవ వేతనంతోపాటు నాలుగు నెలల బిల్లులు రావాల్సి ఉంది. అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. – రాములమ్మ, మధ్యాహ్న భోజన
నిర్వాహకురాలు, పాండురంగాపురం
బిల్లులు విడుదల చేయాలి
బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. గౌరవ వేతనాలు, గుడ్ల డబ్బులు కూడా రావాల్సి ఉంది. పనులకు వెళ్లకుండా వంటలు చేయడానికి వస్తే బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.
– డేరంగుల అనసూయమ్మ, నాగారం
బడ్జెట్ రాగానే...
మధ్యాహ్న భోజన బిల్లులు, గౌరవ వేతనం, గుడ్ల బకాయిలు బడ్జెట్ రాకపోవడంతో పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు తయారుచేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాం. బడ్జెట్ రాగానే ఖాతాల్లో జమ చేస్తాం. – వెంకటేశ్వరాచారి, డీఈఓ

బిల్లులు రాట్లే..

బిల్లులు రాట్లే..

బిల్లులు రాట్లే..

బిల్లులు రాట్లే..