
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చర్ల: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావులతో కలిసి ఆమె చర్ల మండలంలో పర్యటించారు. లక్ష్మీకాలనీలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చర్లలోని రైతు వేదికలో ఇందరిమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే రైతును రాజును చేసే ప్రభుత్వమని, పేదల కష్టాలను తీర్చే ప్రభుత్వమని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క