
అభివృద్ధి చేయడంలో విఫలం
పాల్వంచరూరల్: అవసరమైన వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయిన మాట్లాడా రు. కేటీపీఎస్, ఎన్‌ఎండీసీ, ఏపీ స్టీల్ వంటి పరిశ్రమలతో నాడు వెలుగు వెలిగిన పాల్వంచ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక ప్రజలు వలస పోతున్న దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పాల్వంచ, కొత్తగూడెంను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే సమయంలో సంప్రదింపులు జరపలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణలో జాప్యం చేస్తోందని ఆక్షేపించారు. సమావేశంలో నాయకులు భూక్యా సీతారాములు, బుడగం రవికుమార్, యడ్లపల్లి శ్రీనివాస్‌కుమార్, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, దున్నపోతుల రాజు, రవి, రమేశ్, వెంకట్, రామారావు, వీరన్న, సురేశ్ పాల్గొన్నారు.
పది సప్లిమెంటరీ ఫలితాల్లో 66.97 శాతం ఉత్తీర్ణత
కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 66.97 ఉత్తీర్ణత శాతం నమోదైందని డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పరీక్షలకు 1,205 మంది విద్యార్థులు హాజ రు కాగా, 807 మంది ఉత్తీర్ణత సాధించారని వివరిచారు. బాలురు 775 మందికి 512 మంది (66.06 శాతం) ఉత్తీర్ణత, బాలికలు 430 మందికి గాను 295 మంది (68.60శాతం) ఉత్తీర్ణత సాధించారని పేర్కొ న్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూలై 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు విద్యార్థులు చదివిన పాఠశాలల హెచ్‌ఎంలను సంప్రదించాలని లేదా ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్ ఎస్.మాధవరావు 99890 27943 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
జగన్నాథపురంలో చోరీ
పాల్వంచరూరల్: తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలే చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన కొత్త దయాకర్‌రెడ్డి పాల్వంచలోని డీఏవీ పాఠశాలలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దయాకర్‌రెడ్డి భార్య వెంకటలక్ష్మి కేటీపీఎస్‌లో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి ఇద్దరు విధులకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చి చూసే సరికి ఇంటి తలుపు తాళం, బీరువా తాళం పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న రూ.25 వేల విలువైన వెండి వస్తువులను చోరీ చేశారు. వెంకటలక్ష్మి శుక్రవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
కుక్కల దాడిలో
దుప్పి మృతి
దమ్మపేట: కుక్కల దాడిలో మచ్చల దుప్పి పిల్ల మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఇన్‌చార్జ్ అధికారి రవికిరణ్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన మేకలు మేత కోసం సమీపంలోని అడవికి వెళ్లాయి. సాయంత్రం వాటితోపాటు మచ్చల దుప్పి పిల్ల తప్పిపోయి గ్రామానికి వచ్చింది. గ్రామంలోని కుక్కలు ఆ దుప్పిని చూసి వెంటాడి, శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో దాడి చేశాయి. దీంతో ఆ దుప్పి పిల్ల మృతి చెందింది. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వారు చేరుకుని, దుప్పి పిల్ల కళేబరాన్ని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. కాగా, పోస్టుమార్టం శనివారం జరగనుండగా నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని రేంజర్ తెలిపారు.