
బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం
● అన్ని ఏరియాల్లో నూతన గనుల సాధనకు ప్రయత్నాలు ● సంస్థ అభివృద్ధికి ఏరియా జీఎంలు ప్రణాళిక రూపొందించాలి ● బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై దృష్టి పెట్టాలి ● సింగరేణి సీఎండీ బలరామ్ దిశా నిర్దేశం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని సీఎండీ ఎన్.బలరామ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన అన్ని ఏరియాల జీఎంలు, ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీ విస్తరణ, సమస్యల పరిష్కారంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఓవర్‌బర్డెన్ తొలగింపులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన గనులు లేకపోతే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి తదితర ఏరియాలకు భవిష్యత్ ఉండదని, కొత్త గనుల కోసం ముమ్మరంగా ప్రయత్నించాలని అన్నారు. అటవీ అనుమతులు సాధనలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. శాంతిఖని, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్‌ల్లో నష్టాల నివారణకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు సత్తుపల్లిలో కోల్‌వాషరీ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్.వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లుతో పాటు అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.
ప్రజాకవి జయరాజుకు సన్మానం
సింగరేణి సంస్థ మాజీ ఉద్యోగి, ప్రజాకవి గొడిశెల జయరాజును కొత్తగూడెంలో సీఎండీ ఎన్.బలరామ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయరాజుకు ఇప్పటికే పలు అవార్డులు, పురస్కారాలు వచ్చాయని, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి అందిస్తూ తగిన గుర్తింపునివ్వడం హర్షణీయమని అన్నారు. సింగరేణి సంస్థలో ఫిట్టర్‌గా విధులు నిర్వహిస్తూనే కార్మికుల, కర్షకుల కష్టాలపై స్పందించేవారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అందరికీ అర్థమయ్యేలా పాటల రూపంలో వివరించేవారని తెలిపారు. సింగరేణి కార్మికులు నెల రోజుల పాటు చేసిన సమ్మెలో పాల్గొన్న జయరాజు.. ఎవరు ప్రలోభ పెట్టినా తన పంథా వీడలేదని చెప్పారు. అనంతరం జయరాజు మాట్లాడుతూ.. సింగరేణి అందించిన సహకారం, ప్రోత్సాహం వల్లే తాను కవిగా, ఉద్యమకారుడిగా, ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. కార్యక్రమంలో కోల్ మూమెంట్ డైరెక్టర్ ఎస్డీఎం సుభాని పాల్గొన్నారు.