
పోడు భూములిక పచ్చగా..
గిరిజన రైతుల కోసం ‘ఇందిర గిరి జల వికాసం’
● రాష్ట్రంలోనే భద్రాచలం ఐటీడీఏకు ఎక్కువగా.. ● ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 1.96 లక్షల ఎకరాలు లక్ష్యం ● పైలట్ ప్రాజెక్ట్‌గా చండ్రుగొండ మండలం ఎంపిక
భద్రాచలం: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సారవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పోడు భూములకు విద్యుత్ సరఫరా లేక, అటవీ శాఖ అనుమతులు రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గిరిజనులకు ‘సౌర నీరు’ అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్రంలో పట్టాలు కలిగిన పోడు భూముల హక్కుదారులకు ‘ఇందిర గిరి జల వికాసం’ పేరిట కొత్త పథకాన్ని చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారికంగా ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాలను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రం మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న భద్రాచలం ఐటీడీఏకే అత్యధిక నిధులు కేటాయించడంతో జిల్లాలోని అనేక మంది గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
పోడు భూములు సాగులోకి తెచ్చేందుకే..
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అనేక ఏళ్లుగా పోడు భూముల ఆధారంగానే ఎంతోమంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరికి దివంగత నేత వైఎస్సార్ హయాంలో హక్కు పత్రాలు అందజేశారు. ఆ తర్వాత కూడా కొంతమందికి హక్కు పత్రాలు అందాయి. అయితే ఈ భూములకు సాగు నీరు లేక గిరిజన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉచిత విద్యుత్ అందజేయాలంటే ఆర్థిక భారంతో పాటు అటవీ శాఖ క్లియరెన్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ ద్వారా పంప్‌సెట్లను అందించాలని నిర్ణయించింది. తద్వారా వచ్చే ఐదేళ్లలో పోడు సాగుదారులందరికీ సోలార్ పంప్ సెట్లకు రూ.6 లక్షల చొప్పున నిధులు విడుదల చేయనుంది.
పథకం అమలు ఇలా..
ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించింది. రెండున్నర ఎకరాల పొలం ఉన్న రైతును సింగిల్ యూనిట్‌గా గుర్తించింది. అంతకంటే తక్కువగా ఉన్న రైతులను గ్రూప్‌గా ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించి రైతులను గుర్తించాలి. జిల్లా స్థాయిలో ఈనెల 30 నాటికి సర్వే, ఇతర పనుల టెండర్లు ఖరారు చేసి, జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు ప్రారంభించేలా షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 26 నుంచి మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరు బావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, ఇతర పనులు పూర్తి చేయాలి. జిల్లా స్థాయిలో పథకం అమలుకు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
భద్రాచలం ఐటీడీఏకు భారీగా..
రాష్ట్రంలో 2025 – 26 నుంచి 2029 – 30 వరకు ఆరు లక్షల ఎకరాలను జల వికాసం పథకంలోకి తీసుకురానున్నారు. అందులో జిల్లాలోనే అత్యధికంగా 1.96 లక్షల ఎకరాల భూమి సాగులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించడం విశేషం. కాగా, ఈ పథకానికి భద్రాచలం ఐటీడీఏ పరిఽధిలోని చండ్రుగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే బెండాలపాడు, రాయికంపాడు తదితర గ్రామాల్లో సోలార్ పంప్‌సెట్లు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకం ప్రారంభమయ్యాక జిల్లాలో మొదలు పెట్టనున్నారు.
రానున్న ఐదేళ్లలో జిల్లాకు కేటాయింపులు ఇలా..
సంవత్సరం రైతులు పోడు ఎకరాలు
2025 – 26 2,921 8,046
2026 – 27 14,856 46,988
2027 – 28 14,856 46,988
2028 – 29 14,856 46,988
2029 – 30 14,856 46,988
మొత్తం 62,347 1,96,000
గిరిజన పోడు రైతులకు పూర్తి సబ్సిడీ
పోడు హక్కు పత్రాలున్న భూముల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు పూర్తి సబ్సిడీతో ఈ పథకం అమలు జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు ప్రకటించింది. ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలంలో ట్రయల్ రన్ నిర్వహించాం.
– డేవిడ్ రాజ్, ఐటీడీఏ ఏపీఓ జనరల్

పోడు భూములిక పచ్చగా..