
మనుమరాలిని నృత్య శిక్షణకు తీసుకెళ్తూ..
● బొలెరో వాహనం ఢీకొని తాత మృతి ● బాలిక కాళ్లకు తీవ్రగాయాలు
పాల్వంచరూరల్: మనమరాలిని నృత్య తరగతులకు తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని పునుకుల సమీపంలో చోటుచేసుకుంది. మనుమరాలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కుల కథనం ప్రకారం... మండల పరిధిలోని పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన నీరుడు రామారావు (63) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరోతరగతి చదువుతున్న తన మనుమరాలు తులసి వేసవి సెలవులు కావడంతో పాల్వంచలో క్లాసికల్ నృత్యం నేర్చుకుంటోంది. దీంతో శుక్రవారం మనుమరాలిని తీసుకుని ద్విచక్రవాహనంపై పాల్వంచకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పునుకుల సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే పాల్వంచ నుంచి కిన్నెరసాని వైపు వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రామారావుకు తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. నాట్యం నేర్చుకుంటున్న మనుమరాలి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. బాలికను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా రు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. మృతుడికి భార్య ముత్తమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం రామారావు పెద్ద కుమారుడు చిరంజీవి కూడా ట్రాక్టర్, ఆటో ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు తండ్రి కూడా అదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు. మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా చిన్నకుమారుడు అప్పారావు అమెరికాలో ఉంటుండగా, ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.