
ఇప్పుడు ప్రారంభిస్తేనే మేలు
భద్రాచలమే కీలకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి నుంచి గోదావరి పుష్కరాలంటే ఆంధ్రకు రాజమండ్రి, తెలంగాణకు భద్రాచలం కేంద్ర స్థానంగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనప్పటికీ భద్రాచలం ప్రధాన కేంద్రంగానే ఉంది. కొత్తగా ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు గోదావరి పుష్కరాల్లో ప్రముఖంగా నిలిచాయి. తిరిగి గోదావరికి 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు, భద్రాచలం పట్టణం, ఏడాది పొడవునా ఇక్కడ జరిగే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఏర్పాట్ల యాక్షన్ ప్లాన్ రెడీ చేయాల్సిన అవసరముంది. లేకపోతే 2015 తరహాలోనే పైపనులే చేపడితే మరోసారి భద్రాద్రి నష్టపోక తప్పదు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి తీరం వెంబడి కాళేశ్వరంలో కనుల పండువగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వీటితో కాళేశ్వరంలో కొత్తగా సరస్వతి మాత విగ్రహం, స్నానఘట్టాలు, నదీ తీరం వెంబడి కొత్త రోడ్లు, టెంట్ సిటీలు వెలిశాయి. ఇదే తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో నెలకొన్న స్థల సమస్య, రోజురోజుకూ పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని గోదావరి పుష్కరాలకు యాక్షన్ ప్లాన్ ముందుగానే సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే 2015 పరిస్థితే పునరావృతం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
వన్నె తెచ్చిన పుష్కరాల పనులు
ఈ శతాబ్దంలో 2003, 2015లలో గోదావరికి పుష్కరాలు వచ్చాయి. ముఖ్యంగా 2003 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన కరకట్ట, స్నానఘట్టాలు భద్రాచలం రూపు రేఖలను మార్చివేశాయి. కరకట్ట నిర్మాణంతో భద్రాచలం పట్టణానికి గతంలో పోల్చితే వరదల నుంచి భద్రత కలిగింది. విశాలమైన స్నానఘట్టాలు వచ్చాయి. మహిళలు బట్టలు మార్చుకునే గదులు, కల్యాణకట్టలు అందుబాటులోకి వచ్చాయి. గోదావరి మాతకు విగ్రహం, రామాయణ ఇతివృత్తం తెలిపేలా శిల్పాలను ఏర్పాటు చేశారు. దీంతో భద్రాచలానికి కొత్త శోభ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో జరిగిన పుష్కరాలకు చెప్పుకోతగ్గ పనులేవీ భద్రాచలంలో జరగలేదు. గతంలో ఉన్న వాటినే మరికొంత మెరుగు పరిచారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటుకావడం, ఇక్కడ స్థల సమస్యలు వంటి అంశాలు అప్పుడు పుష్కర పనులకు అడ్డం పడ్డాయి.
కీలక అంశాలు
రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం క్షేత్రంలో స్థల సమస్య ఏర్పడింది. దీంతోపాటు ఏటా జూలైలో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకుని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా టెంట్ సిటీ, స్మార్ట్ సిటీలను ఎక్కడ నిర్మించాలనే అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం భద్రాచలంలో సామాన్య భక్తుల పుష్కర ఘాట్, బూర్గంపాడు మండలం మోతె దగ్గర వీఐపీ ఘాట్‌లు ఉన్నాయి. రాబోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా కొత్త ఘాట్లను నిర్మించాలి. వాహనాల పార్కింగ్, రాకపోకలపైనా అధ్యయనం చేయాల్సి ఉంది. వీటితో పాటు ఏడాది పొడవునా భద్రాచలం వచ్చే భక్తులకు ఉపయోగపడేలా డార్మిటరీలు, లాకర్లు, సామూహిక స్నానాల గదులు, టాయిలెట్ల నిర్మాణాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. నదీ తీరంలో సాంస్కృతి కార్యక్రమాలు జరిగేలా అంఫీ థియేటర్, కరకట్ట పైకి సులువుగా ఎక్కి దిగేలా లిఫ్టులు, అదనపు ర్యాంపులు, ఐకానిక్ వంతెన తదితర నిర్మాణాలు వంటివి రాబోయే పుష్కర పనుల్లో కీలకంగా మారనున్నాయి.
కాళేశ్వరంలో వైభవంగా సరస్వతి పుష్కరాలు
2027 జూలైలో
గోదావరికి పుష్కరాలు
రాష్ట్ర విభజనతో భద్రగిరిలో మారిన పరిస్థితులు
కార్యాచరణ సిద్ధం చేయాలని
కోరుతున్న భక్తులు

ఇప్పుడు ప్రారంభిస్తేనే మేలు