
మాడ వీధులకు వీడని మూఢం
● భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు ● స్థలం ఇచ్చేందుకు ఏడుగురి నిరాకరణ ● ఈ అడ్డంకి తొలగితేనే సాగనున్న విస్తరణ ● మాస్టర్ ప్లాన్ ప్రకటన కోసం ఎదురుచూపులు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి తొలి అడుగు పడినా.. ముందుకు సాగడం లేదు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు భూసేకరణ, ఇళ్లు, దుకాణాల తొలగిస్తే నిర్వాసితులకు అందించే పరిహారం కోసం శ్రీరామనవమికి ముందు రూ.35 కోట్లు విడుదల కాగా, సుమారు 40 కుటుంబాలకు అందజేశారు. నవమి రోజే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తారని భావించినా అది జరగలేదు. దీనిపై ఆలయ అధికారులకు సీఎం స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు సాగే పరిస్థితి నెలకొంది.
ఈనెలలో సేకరణ పూర్తయితేనే..
నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయగానే రెవెన్యూ అధికారులు భూ సేకరణ పూర్తి చేసి దేవస్థానానికి అప్పగించాల్సి ఉంది. అయితే శ్రీరామనవమి సందర్భంగా తమ వ్యాపారం దెబ్బతింటుందని, ఆ తర్వాతే తాము ఖాళీ చేస్తామని ఆయా షాపుల వారు రెవెన్యూ అధికారులను, ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. దీంతో అప్పుడు సేకరణ పనులు ఆపేశారు. నవమి వేడుకలు పూర్తయ్యాక అధికారులు మళ్లీ భూ స్వాధీనానికి వెళ్లగా.. ఈనెల 22న హనుమాన్ జయంతి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాలధారులతో భద్రగిరి రద్దీగా ఉంటుందని, ఈ సమయంలోనే వ్యాపారాలు అధికంగా జరుగుతాయి కాబట్టి మరోమారు వాయిదా వేయాలని వారు వేడుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు పునరాలోచనలో పడ్డారు. కాగా, భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిపై కోర్టును ఆశ్రయించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి అందజేయాల్సిన నష్టపరిహారాన్ని కోర్డుకు సరెండర్ చేసి, భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలి..
మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించగా, నిర్వాసితులకు పరిహారంగా రూ.35 కోట్లు విడుదల చేసింది. మరో రూ.25.20 కోట్లతో మాడ వీధుల విస్తరణ చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే ఆలయ అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. కాగా నవమి ముందు ప్రభుత్వం ఆలయ అభివృద్ది నమూనాలు విడుదల చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్‌కు మరికొన్ని అదనపు వసతులను కల్పించేలా ఈ నమూనాలు రూపొందించారు. అయితే మాడ వీధుల విస్తరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ అమలుకూ తగిన నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు.
నిరాకరించిన వారితో చర్చిస్తాం..
ఏడు కుటుంబాల వరకు నష్టపరిహారం చెక్కులు తీసుకోలేదు. వారితో మళ్లీ చర్చలు జరిపి సానుకూలంగా భూ సేకరణకు కృషి చేస్తాం. అయినా వినకుంటే నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని కోర్టుకు అందజేసి భూ సేకరణను పూర్తి చేస్తాం. వీలైనంత త్వరలో ఆలయానికి భూములు అందజేస్తాం.
– కొల్లు దామోదర్ రావు, ఆర్డీఓ, భద్రాచలం
కొన్ని కుటుంబాల నిరాకరణ..
భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ముందే 40 నిర్వాసిత కుటుంబాలకు రూ.34,45,86,000 అందించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఓ ప్రధానార్చకుడితో పాటు మరో ఆరు కుటుంబాల వారు స్థలాలు ఇచ్చేందుకు, నష్టపరిహారం స్వీకరణకు నిరాకరించారని చెబుతున్నారు. వీరు గతంలో కూడా మాడ వీధుల విస్తరణలో పరిహారం స్వీకరణకు నిరాకరించారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కంటే అధికంగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ, ఆలయ అధికారులు తీసుకునే చర్యలపైనే పనులు ఆధారపడి ఉంటాయి.

మాడ వీధులకు వీడని మూఢం