
ఐదెకరాల్లో సాగు చేసిన పంట దగ్ధం
గుండాల: ప్రమాదవశాత్తు మొక్కజొన్న కంకుల రాశికి నిప్పంటుకుని ఐదెకరాల్లో సాగు చేసిన పంట దగ్ధమైన ఘటన మండలంలోని నర్సాపురం తండాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నర్సాపురం తండాకు చెందిన మాలోత్ హేమ యాసంగిలో ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కంకులు కోసి మిల్లర్‌లో పట్టించేందుకు కల్లంలో ఆరబోశాడు. కాగా, మంగళవారం తెల్లవారుజామున పక్క చేనులో కోసిన మొక్కజొన్న కొయ్యలను రైతు కాల్చుతుండగా ఆ మంటలు హేమ ఆరోబోసిన రాశికి అంటుకుని కంకులు కాలిపోయాయి. ఉదయాన్నే అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు కాలిపోయిన కంకులను చూసి బోరున విలపించారు. కంకులతో పాటు కోసేందుకు సిద్ధంగా ఉన్న చేను, సాగునీటి కోసం అమర్చిన పైపులు సైతం కాలిపోయాయి. దీంతో రూ. 1.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని, అధికారులు తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
రూ.1.50 లక్షల విలువైన
మొక్కజొన్న అగ్నికి ఆహుతి