భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించాక స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కమనీయం.. నృసింహ కల్యాణం
శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనృసింహ స్వామి వారి తిరు కల్యాణ వేడుక వైశాఖ పౌర్ణమి సందర్భంగా సోమవారం కమనీయంగా జరిగింది. మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించిన అర్చకులు.. వేద మంత్రాల నడుమ కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈఓ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని వైభవంగా చండీహోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ తర్వాత హోమం, చివరన పూర్ణహుతి నిర్వహించారు. హోమంలో పాల్గొన్న 17 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని కళాశాల్లో సీటభర్తీ కోసం ఈనెల 15న బాలికలకు, 16న బాలురకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఉదయం 9గంటలకు మొదలయ్యే కౌన్సెలింగ్‌కు 2024–25లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94909 57271, 94909 57270 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సుజాతనగర్: ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు కోరారు. సుజాతనగర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ప్రైవేట్ వ్యాపారులకు, దళారులకు ధాన్యం తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, రైతుల వివరాలు, మిల్లర్లకు తరలిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఓ నర్మద, టెక్నికల్ ఏఓ నాగయ్య, సాయినారాయణ, విజయ్‌భాస్కర్ రెడ్డి, ఏఈఓలు ప్రనూష, నరసింహ, శరత్ తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు ముత్తంగి అలంకరణ

రామయ్యకు ముత్తంగి అలంకరణ