వైద్యసిబ్బందికి సెలవులు రద్దు | - | Sakshi
Sakshi News home page

వైద్యసిబ్బందికి సెలవులు రద్దు

Dec 5 2023 5:20 AM | Updated on Dec 5 2023 5:20 AM

- - Sakshi

డీఎంహెచ్‌ఓ అమర్తలూరి శ్రావణ్‌బాబు

గుంటూరు మెడికల్‌: తుఫాన్‌ నేపథ్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు తెలిపారు. సోమవారం ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారు. వైద్యులు, వైద్య సిబ్బందికి సాధారణ సెలవులు రద్దు చేస్తున్నామన్నారు. అత్యవసరమైతే తప్ప సెలవులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. హై రిస్క్‌ ప్రెగ్నెన్సీ కేసులను గుర్తించాలన్నారు. ఈవారంలో ప్రసవమయ్యే గర్భిణులను సమీపంలోని జిల్లా ఆస్పత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రం, గుంటూరు జీజీహెచ్‌లో అడ్మిట్‌ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పదిరోజుల్లో 285 మంది ప్రసవమయ్యే అవకాశం ఉందని, వారందరినీ తక్షణమే సమీపంలోని ఆస్పత్రుల్లో అడ్మిట్‌ చేయాలని చెప్పారు. హైరిస్క్‌ గర్భిణులు జిల్లాలో 24 మంది ఉన్నారని, వీరిలో ఇప్పటికే తొమ్మిది మందిని ఆస్పత్రుల్లో అడ్మిట్‌ చేసినట్టు వెల్లడించారు. అన్నిరకాల ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు

జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

నరసరావుపేట: రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొంటామని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ధాన్యం కమిటీ సమీక్ష నిర్వహించారు. 2023–24 ఖరీఫ్‌లో 284 ఆర్‌బీకేల పరిధిలో 26,796 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని పేర్కొన్నారు. 66,429 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్టు వివరించారు. దీనిలో 2,200 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. గ్రేడ్‌ ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 మద్దతు ధర ప్రకటించినట్టు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓలు ఎం.శేషిరెడ్డి, రాజకుమారి, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి, జిల్లా సివిల్‌ సప్లయిస్‌ అధికారి పద్మశ్రీ, మేనేజర్‌ మహాలక్ష్మి, నిర్వాహకులు పాల్గొన్నారు.

సాయుధ దళ కుటుంబాల సంక్షేమానికి కృషి

నరసరావుపేట: దేశరక్షణకు నిరంతర సేవలు అందజేసి యుద్ధంలో మృతిచెందిన, ఉద్యోగ విరమణ చేసిన సాయుధ దళ సభ్యుల కుటుంబాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్లాగ్‌డేకు సంబంధించిన పోస్టర్‌, కార్‌ ఫ్లాగ్స్‌, పతాక స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఏటా డిసెంబరు ఏడున సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. దీనికి విరాళాలు అందజేసి సహకరించాలని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి ఆర్‌.గుణశీల, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

రెండు బస్సులు ఢీ పది మందికి గాయాలు

నరసరావుపేట రూరల్‌: ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, మరో ప్రైవేటు బస్సును ఢీకొనటంతో పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన సోమవారం రాత్రి గుంటూరు–కర్నూలు రహదారిపై పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద చోటుచేసుకుంది. వినుకొండ నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెట్లూరివారిపాలెం గ్రామం వద్దకు రాగానే నరసరావుపేట మీదుగా బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో వినుకొండ డిపోలో టీఐ–2గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి చేతికి తీవ్ర గాయం కాగా మరో తొమ్మిది మంది ముఖంపై గాయాలయ్యాయి. గాయపడిన వారిని లింగంగుంట్ల కాలనీలోని 200 పడకల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. రూరల్‌ పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిమ్మకాయల ధరలు

తెనాలిటౌన్‌: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయల కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.3,800, మోడల్‌ ధర రూ.3,200 వరకు పలికింది.

29,359 బస్తాల మిర్చి రాక

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు సోమవారం 29,359 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 24,619 బస్తాలు అమ్మకాలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement