
ప్రజలను వంచించిన చంద్రబాబు
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మాత్రమే అతిపెద్ద మోసగాడని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం మండలంలోని అద్దేపల్లిలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం వేమూరు నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తూ పథకాలను అమలు చేయకుండానే మభ్యపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండానే ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు అబద్ధాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్చిన తరుణం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నేడు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో వరి రైతులకు ఉరి వేసకుని.. మిర్చి రైతులకు రైలు కింద పడి.. పొగాకు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమైన విషయమన్నారు. పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా, ఇస్తానన్న పెట్టుబడి సాయం, ఇతర పథకాలు అందించకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మేలు ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల అమలును నేడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తెలియజేయడంతోపాటు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి చేకూరిన లబ్ధి గురించి జగనన్న సైనికులందరూ ప్రతి గ్రామంలో వివరించాలని కోరారు. తద్వారా చంద్రబాబుపై యుద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు బాకీ పడుతున్న చంద్రబాబు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీర్చలేని బాకీ పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి ఇంటికీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ది చేకూరిస్తే, నేడు చంద్రబాబు ప్రజలను అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అబద్ధపు హామీలను మండలస్థాయి, గ్రామ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ నాయకులు కేసులు పెడతార్న భయాలు, అపోహలు వద్దని సూచించారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తప్పుడు కేసులు పెడితే చివరకు పోలీసులపైనే ప్రయివేటు కేసులు పెట్టేందుకూ వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ఈ సందర్భంగా ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’పై ఆయన కార్యకర్తలు, నాయకులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దావూరి లలితకుమారి, వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి నాయకులు కోగంటి లవకుమార్, హుసేన్, వైఎస్సార్ సీపీ భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, చుండూరు, అమృతలూరు మండల కన్వీనర్‌లు పడమట శ్రీనివాసరావు, దాది సుబ్బారావు, సుగ్గున మల్లేశ్వరరావు, అన్నపరెడ్డి రఘురామరెడ్డి, హేమచంద్ర శ్రీనివాసరావు, వేమూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మన బాధ్యత వైఎస్సార్ సీపీ కుటుంబం మొత్తం కలిసికట్టుగా పోరాటం చేయాలి బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీపై గ్రామ గ్రామాన ప్రచారం తక్షణ అవసరం కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి ఇది తొలిమెట్టు వేమూరులో కార్యక్రమం ప్రారంభోత్సవంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు పిలుపు
ప్రతిపక్ష నేతలపై వేధింపులతో సరి
బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమటి మాధవరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం అనే సంతృప్తి మినహా ఏడాది పాలనలో చేసిందేమీ లేదన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలతో చివరకు ఆ పార్టీ కార్యకర్తలే విసిగి వేసారే పరిస్థితి వచ్చిందన్న విషయం పచ్చి నిజమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాల వల్ల నేడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయనను తలచుకుంటున్నారని పేర్కొన్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని పొడిచే దున్నపోతును తెచ్చుకున్నామన్న ఆలోచన ప్రజలతోపాటు టీడీపీ కార్యకర్తలలోనే ఉందని చెప్పారు.

ప్రజలను వంచించిన చంద్రబాబు