
గృహ నిర్మాణంలో లక్ష్యాలను సాధించాలి
బాపట్ల: పక్కా గృహాల నిర్మాణాలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో గురువారం ఆయన కలెక్టర్ చాంబర్‌లో దీనిపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలలో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు 8,299 పక్కా గృహాలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు 3,687 గృహాలే పూర్తి కావడంతో మండల స్థాయి అధికారులను కలెక్టర్ నిలదీశారు. దీనికి కారణాలపై ఆరా తీశారు. చార్జి మెమోలు ఇచ్చినా పనితీరులో మార్పు లేదని అసహనం వ్యక్తపరిచారు. గృహ నిర్మాణ శాఖలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో 17వ స్థానంలో ఉన్న జిల్లాను 23వ స్థానానికి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. లక్ష్యాలను సాధించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మండల ఈఈలు, డీఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి