మడ అడవుల నుంచి అలల వరకు ఆక్రమణలే..
సాక్షి ప్రతినిధి,బాపట్ల: వేటపాలెం మండలాల పరిధిలోని విజయలక్ష్మీపురం, ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రం తీరం(బీచ్)లో ఉన్న ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములను ఈ ప్రాంతానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలు, రిసార్ట్స్ యజమానులకు కట్టబెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. ప్రైవేటు భూముల ధరతో పోలిస్తే కాస్త తక్కువ ధరకు ప్రభుత్వ, అటవీ భూములు లభిస్తుండడంతో రిసార్ట్స్ వ్యాపారులు రెవెన్యూ అధికారులకు అడిగినంత ముట్టజెప్పి భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు. కబ్జా భూములను తమ రిసార్ట్‌లలో కలిపేసుకొని వాటిని మరింతగా విస్తరిస్తున్నారు. ఇదే అదనుగా చీరాల టీడీపీ ముఖ్య నేత కొందరు రెవెన్యూ అధికారితో కలిసి ఇక్కడున్న ప్రభుత్వ, అటవీ భూములను కొట్టేసి వాటిని తిరిగి రిసార్ట్ వ్యాపారులతోపాటు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వేటపాలెం మండలంలో ఇప్పటికే వేలాది ఎకరాలుగావున్న అటవీ, ప్రభుత్వ భూములను టీడీపీ నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు అమ్మకానికి పెట్టి రూ.కోట్లు గడించినట్లు రెవెన్యూ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది.
ఆక్రమించి.. విస్తరించి
రెవెన్యూ అధికారులకు డబ్బులు గుమ్మరించి కొంత, కబ్జాచేసి మరికొంత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్న వ్యాపారులు, పచ్చనేతలు తీరంలో రిసార్ట్‌లు, అధునాతన విడిది గృహాలు నిర్మించుకుంటున్నారు. వేటపాలెం మండలంలో విజయలక్ష్మీపురం మొదలు కొని ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరంవరకూ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి.
ఊపందుకున్న రిసార్ట్స్ నిర్మాణాలు
చీరాల, వేటపాలెం సముద్రతీర ప్రాంతానికి రోజురోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వీకెండ్స్‌లోనే ఏపీ నలుమూలలనుంచే కాక అటు తెలంగాణ నుంచి లక్షలాదిమంది తరలివస్తుండగా మిగిలిన రోజుల్లోనూ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తీరంలో వ్యాపారం పెరగడంతో ఇక్కడ రిసార్ట్స్ నిర్మించేందుకు ఏపీతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సినీ పరిశ్రమకు చెందిన వారితోపాటు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అన్నివర్గాలకు చెందిన స్థితి మంతులు భూములు కొంటున్నారు. దీంతో ఒకప్పుడు ఎకరం రూ. 25 లక్షలలోపు వున్న భూముల ధరలు నేడు ఎకరం రూ. 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ధర పలుకుతోంది. వేటపాలెం పరిధిలోని ఓడరేవు మొదలు పొట్టిసుబ్బయ్యపాలెం వరకూ ఎకరం ధర సగటున రూ. 5 కోట్లుగా వుంది.
అధికారులకు కాసుల పంట
వేటపాలెం ప్రాంతంలో ప్రైవేటు భూములకు మించి ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములు ఉండడంతో ఇదే అవకాశంగా కొందరు రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని ఆ భూములను రిసార్ట్ యజమానులు, పచ్చనేతలకు అప్పగిస్తున్నారు. ఇక్కడి పచ్చనేత తనకు అనుకూలురైన ఒకరిద్దరు రెవెన్యూ అధికారులను వేటపాలెంలో నియమించుకొని భూముల విక్రయాలతో రూ.కోట్లు దండుకుంటునట్లు ఆరోపణలున్నాయి.
– అక్రమాలు సృతిమించడంతో వేటపాలెం తహసీల్దారును ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకట మురళి సరెండర్ చేశారు. తీరంలో భూ ఆక్రమణలపై చీరాల ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఇది సజావుగా సాగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముంది.
టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి దందా రిసార్ట్స్ యజమానులకు తీరం భూముల అప్పగింత ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల అమ్మకం కొన్న భూముల్లో ప్రభుత్వ భూములను కలిపేసుకుంటున్న వైనం తీరంలో ఎకరా రూ. 3 కోట్ల నుంచి 6 కోట్లు అమాంతం పెరిగిన భూముల ధరలు ఇదే అవకాశంగా ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న రెవెన్యూ అధికారులు సీఆర్‌జెడ్ నిబంధనలకు తిలోదకాలు మడ, సర్వి చెట్లు కొట్టేసి సీ వ్యూకు రిసార్ట్‌లు
ఆక్రమణలు ‘అల’.. పట్టించుకోరేలా?
తీరంలో రిసార్ట్‌లు నిర్మించిన వ్యాపారులు తీరం అలల వరకూ ఆక్రమించి ఆ ప్రాంతంలో గ్రావెల్, చిప్స్ వేసి చదును చేసి తమ రిసార్ట్‌లకు వచ్చే పర్యాటకులకు విడిదిగా మారుస్తున్నారు. సాయంత్రం పూట పర్యాటకులు ఆ ప్రాంతాల్లో కూర్చొని సముద్రాన్ని చూసేలా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తీరాన్ని సముద్రం నీటివరకూ ఆక్రమిస్తున్నా చర్యలు శూన్యమనే చెప్పాలి.
నిబంధనలకు
ఆ‘మడ’ దూరం
రిసార్ట్‌ల పరిధిలో సీ వ్యూ కనిపించేందకు అడ్డుగావున్న మడ, సర్వి చెట్లను అడ్డంగా నరికివేస్తున్నారు. తీరంలోని మడ, సర్వి చెట్లను నరికి వేయడం నేరం. కానీ అధికారులను లోబరుచుకొన్న రిసార్ట్‌ల యజమానులు ఏమాత్రం ఖాతరు చేయక చెట్లను నరికి వేస్తున్నారు. సముద్ర తీరంలో అలల తాకిడి, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరం కోతకు గురికాకుండా ఉండేందుకు మడ చెట్లను పెంచుతారు. ఉదాహరణకు 2005లో వచ్చిన సునామీ దెబ్బకు ఇదే ప్రాంతంలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో 9 మంది మరణించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సర్వి మొదలు ఇతర సామాజిక వనాలను అటవీశాఖ పెంచుతుంది.
అల.. ఆక్రమణల తీరం
అల.. ఆక్రమణల తీరం