
ఛిద్రమవుతున్న రోడ్లు
బల్లికురవ: గ్రామీణ రహదార్లు గ్రానైట్ భారీ వాహనాల రాకపోకలతో ఛిద్రమౌతున్నాయి. అడుగుకో గోయ్యితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ నుంచి తీసే స్టీల్‌గ్రే మీటరు, ముడిరాళ్లు మార్టూరు, గణపవరం, జొన్నతాళి, వేమవరం, మే దరమెట్ల, సంతమాగులూరు, ఒంగోలు, మురికి పూడి, తాతపూడిలోని పరిశ్రమలతోపాటు బెంగళూరు, తాడిపత్రి, చెన్నె, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో లారీపై ప్రమాదకరంగా 4 నుంచి 7 బ్లాక్‌లను ఎక్కిస్తూ 70 నుంచి 90 టన్నుల వరకు తరలిస్తున్నారు. గోతుల కారణంగా అంటూ ఎక్కడ రాయి దొర్లి కింద పడుతుందోనని ప్రజలు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం..
భారీ వాహనాల రాకపోకలతో బల్లికురవ–నాగరాజుపల్లి–మార్టూరు, చెన్నుపల్లి–వేమవరం జంక్షన్–తాతపూడి –అనంతవరం, కొణిదెన–వేమవరం జంక్షన్–ఉప్పుమాగులూరు, నక్కబొక్కలపాడు–కొదదెన–మార్టూరు, బల్లికురవ–సంతమాగులూరులో రోడ్లు మోకాటిలోతు గోతులతో 10 కిలో మీటర్లు ప్రయాణానికి సైతం 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతోంది. గోతుల్లో గ్రానైట్ లారీలు కూరుకుని ట్రాఫిక్‌జామ్‌లతో బస్సులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులకు గమ్యం చేరతామన్న గ్యారంటీ లేదు.
గ్రానైట్‌దారుల ఆధీనంలో..
చెన్నుపల్లి–అనంతవరం రోడ్లులో కొండాయపాలెం గ్రామాల మధ్య క్వారీ నిర్వాహకులు ఆర్‌అండ్‌బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రహదారిపైనే యంత్రాలు, లారీలు నిలపడం, లోడింగ్ చేపట్టడం వల్ల తారురోడ్లు సైతం జారుడు బల్లను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో ఈరోడ్డులో ప్రయాణించాలంటే సాహసం చేయక తప్పదు. దెబ్బతిన్న రోడ్లకు ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు. నిధులు మంజూరుతో టెండర్‌కు కాంట్రాక్టర్లను ఆహ్వానించినా భారీ వాహనాల రాకపోకలకు మెయింటెనెన్స్ ఇవ్వలేక రోడ్ల అభివృద్ధికి కాంట్రాక్టర్లు మందుకు రావడం లేదు.

ఛిద్రమవుతున్న రోడ్లు