
కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వాలి
పర్చూరు(చినగంజాం): యజమానితో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ కౌలు కార్డులివ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. పర్చూరులో రామానాయుడు ప్రెస్ వెల్ఫేర్ అసోసియేషన్ హాలులో శుక్రవారం నిర్వహించిన కౌలు రైతు సంఘం జిల్లా విస్తృత సమావేశంలో ప్రసంగించారు. కౌలు రైతులందరికీ గ్రామ సభలు జరిపి కౌలు కార్డులు ఇవ్వాలని.. కనీసం ఫసలీ రాయించి ఆ ప్రకారమైనా కార్డులివ్వాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. పొగాకు కొనుగోలు మందకొడిగా సాగుతోందని తెలిపారు. మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారని, మిర్చి పంటదీ అదే పరిస్థితి అన్నారు. కౌలు రైతులకు కార్డులివ్వడం , బ్యాంకు ద్వారా రుణాలివ్వడం, తిరిగి పంట వేసుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కౌలు రేట్లు చాలా భారంగా ఉన్నాయని కౌలు రైతులంతా ఉమ్మడిగా కౌలు రేట్లు తగ్గించుకోవాలని కోరారు. దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా నాయకుడు కొండయ్య మాట్లాడుతూ వెంటనే సభ్యత్వాలు పూర్తి చేయాలని మండల మహాసభలు జరపాలని జూలై 26న స్వర్ణ గ్రామంలో నిర్వహించే జిల్లా మహాసభలకు అన్ని మండలాల నుంచి రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి టి. యషయ్య అధ్యక్షత వహించారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు బండి శంకరయ్య, భాను, ఏడుకొండలు, గోవింద్, వెంకటరావు, రహీం, కొమ్మినేని శ్రీను, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.